గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమైంది. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుకలు కావడం, అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న గులాబీ పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రతినిధుల సభలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేల నేతృత్వంలో మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. తొమ్మిదేండ్ల పాలనలో సాధించిన ప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్ష తదితర ప్రాధాన్యత అంశాలపై చర్చించనున్నారు.
నిజామాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత నిర్వహిస్తున్న గులాబీ పార్టీ ఆవిర్భావోత్సవానికి శ్రేణులంతా సమాయత్తం అయ్యా రు. అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయంతో మంగళవారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభలు తలపెట్టారు. ఇందులో పార్టీ ప్రాధాన్యతా అంశాలపై ముఖ్య నాయకులు చర్చిస్తారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో సాధించిన ప్రగతిని ఇందులో వివరిస్తారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ మోకాలడ్డుతున్న తీరును కుండబద్ధలు కొట్టినట్లు విశదీకరించబోతున్నారు. బీజేపీ వైఫల్యాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతి అంశాలపై తీర్మానాలను సైతం ప్రవేశ పెట్టనున్నారు. కేటీఆర్ మార్గదర్శకంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వయంగా ఎమ్మెల్యేల సారథ్యంలోనే ఈ సభలు జరుగనున్నాయి. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావోత్సవం ఉన్నందున అంతకు ముందే ప్రతినిధుల సభలతో వినూత్న కార్యక్రమాల నిర్వహణకు అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలు సైతం జోరుగా జరుగుతున్నాయి. నేటి బీఆర్ఎస్ ప్రతినిధుల సభను 3వేల మంది గులాబీ శ్రేణులతో అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.
బీఆర్ఎస్ ప్రతినిధుల సభలను నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల సారథ్యంలో నిర్వహిస్తున్నారు.
గులాబీ జోష్… రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నది. దాదాపుగా ఇంకా ఎనిమిది నెలల కాలం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీల గాయి గత్తరతో ప్రజల మూడ్ అంతా కూడా ఎన్నికలవైపే మలుపు తిరిగింది. ఈ దశలో అందరి కన్నా వేగంగా అధికార బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీ సైతం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన దాఖలాలే లేవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కార్యకర్తల మేలు కోసం వారితో ఆత్మీయ కలయికలతో అలయ్ బలయ్ మాదిరిగానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కేటీఆర్ పిలుపుతో ఉభయ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు మొదలయ్యాయి. మే నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులపై అవగాహనను సైతం కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ సర్కారు వెచ్చించిన నిధులు, చేసిన అభివృద్ధిని ఆత్మీయ సమ్మేళనాల్లో కళ్లకు కడుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా గులాబీ దండులో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
ఒక్కడై కదిలి… కోట్లాది మందిని కదిలించిన నాటి ఉద్యమ సారథి, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ఏప్రిల్ 27, 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పని చేసిన టీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది. ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాల మధ్య స్వరాష్ట్ర సాధనకు కదిలిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రజలు అడుగడుగునా కొండంత అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తలపెట్టిన ఉద్యమాల్లో కేసీఆర్ పిలుపును అందుకుని ప్రజలంతా రోడ్లపైకెక్కి ఉద్యమించారు. ఉమ్మడి రాష్ట్ర పరిపాలకులను అడుగడుగునా నిలదీశారు. భారత ప్రభుత్వాన్ని ఒప్పించి స్వరాష్ర్టాన్ని సాధించగలిగారు. ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షకు దిగి కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కింది. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుటిల ప్రయత్నాలను బద్ధలు కొట్టి 2014లో విజయ తీరాలకు చేరారు. కొద్ది మంది వ్యక్తులతో రాష్ట్ర సాధన కోసం కదిలిన కేసీఆర్ వెంట లక్షలు, కోట్లాది మంది అండగా నిలిచారు. 14 ఏండ్ల ఉద్యమంలో, తొమ్మిదేండ్ల పాలనలో వెన్నుదన్నుగా ఉంటూ కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించడంతో పాటు ఆదరిస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పలు విధాలుగా సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసనలతో ప్రజల్లోకి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ చొచ్చుకెళ్లింది. నేడు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న అధికార పా ర్టీగా ప్రజలకు అనేక విధాలుగా దగ్గరై మూడోసారి ముచ్చటగా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.
బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి బీర్కూర్ చౌరస్తాలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో నిర్వహిం చే ప్లీనరీ ఏర్పాట్లను సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బోర్గాంలోని భూమారెడ్డి కన్వెన్షల్ హాల్లో నిర్వహించే ప్లీనరీ ఏర్పాట్లను సోమవారం ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.