కోటగిరి : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28న తల పెట్టిన చలో ఢిల్లీ (Chalo Delhi) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ( AITUC ) జిల్లా నాయకులు విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో చలో ఢిల్లీ గోడ పోస్టర్ల ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం,కార్పొరేట్ పెట్టుబడి దారులకు అనుకూలంగా మార్పులు చేస్తుందని మండిపడ్డారు. దేశంలో వివిధ కార్మిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వివిధ బోర్డులను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలని కోరారు.
కార్మికుల సంక్షేమ బోర్డులకు కొనసాగిస్తూ స్వతంత్రంగా పనిచేసే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నల్ల గంగాధర్,రాజు, దత్తు పండరి తదితరులు ఉన్నారు.