నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు (విమానాశ్రయం) ఏర్పాటు అంశం ఎన్నో ఏండ్లుగా ఊరిస్తోంది. పదిహేను ఏండ్ల క్రితం ఎయిర్ ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినా ఇప్పటివరకూ పనుల్లో పురోగతి కనిపించడంలేదు. నిర్మాణ పనుల్లో ఇప్పటివరకూ ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. సర్వేలు, పరిశీలనలు తప్ప కార్యరూపం దాల్చడంలేదు. ప్రభుత్వాలు కూడా నోరు విప్పడం లేదు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోవడం లేదు.
ఈ రెండు పార్టీల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు కూడా ఎయిర్‌పోర్టు ఊసేత్తకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిక్కుముడులకు పరిష్కారాన్ని కేసీఆర్ చూపించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎయిర్‌పోర్టు కోసం అందుబాటులోకి తీసుకురావడంతోపాటు నిధులు వెచ్చించేందుకు సమ్మతం తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సర్వేకు శ్రీకారం చుట్టడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తూ కాలాన్ని వెళ్లదీస్తోంది. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఊపు వచ్చే అవకాశాలున్నాయి.
జాతీయ రహదారికి అతిసమీపంలో ఉండడంతో జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టుకు అనేక అనుకూల అంశాలు కలిసొస్తున్నాయి. రైల్వే కనెక్టివిటీ సైతం కాస్తంత దూరంలోనే ఉండడం లాభిస్తున్నప్పటికీ కేంద్ర సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం కాలం వెళ్లదీస్తున్నాడు. విమానయానం అంశం పూర్తి స్థాయిలో కేంద్ర సర్కారు పరిధిలోనిదే అయినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర విమానయాన మంత్రిగా ఏపీకి చెందిన కింజవరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతల్లో ఉన్నప్పటికీ సంప్రదింపులు చేయడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జక్రాన్‌పల్లి వద్ద మొదటగా దేశీయ విమాన సర్వీసులను నడిపించేందుకు మినీ ఎయిర్‌పోర్టును నెలకొల్పే అవకాశాలున్నాయి. ఇందుకోసం రూ.328 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని, 510 ఎకరాల భూమి అవసరమని గతంలోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు రూ.348కోట్లు, 740 ఎకరాల భూమి అవసరమని తేల్చి చెప్పింది. జక్రాన్‌పల్లి వద్ద ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉంది.
భూసేకరణకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేనందున అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసినా పెద్ద భారం పడే అవకాశం లేదు. రాష్ట్రంలో కొత్తగా మొత్తం ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని చోట్ల భూసేకరణ చేయాల్సి వస్తోంది. భూసేకరణ, నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. జక్రాన్‌పల్లిలో మాత్రం కేవలం నిర్మాణాలకే ఖర్చు చేస్తే సరిపోతుంది. శంషాబాద్‌లో ఇప్పటికే రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉండడంతో ప్రభుత్వం మాత్రం ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే అందించింది. స్థలం అనుకూలంగా ఉందని పేర్కొనడమే కాకుండా ఎంత భూమి అవసరమో, ఎన్ని నిధులు వెచ్చించాలో కూడా పేర్కొంది. సర్వేకు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి
సమ్మతం రావాల్సి ఉంది.
ఎయిర్‌పోర్టు అథారిటీ పూర్తి స్థాయి నివేదికను విడుదల చేసి ఏడాదిన్నర గడిచింది. ఆ తర్వాత మరోసారి పట్టించుకున్న వారే లేకుండా పోయారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఎయిర్‌పోర్టు అంశం ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలే లేవు. 2014 -2019 మధ్యకాలంలో ఎంపీగా పని చేసిన కల్వకుంట్ల కవిత ఈ అంశంపై తీవ్రంగా కృషిచేశారు. ఎయిర్‌పోర్టు కోసం కేంద్రానికి పలుమార్లు వినతులు సమర్పించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయపర్చారు.
ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లా దిశ, దశ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో జిల్లా అభివృద్ధి దృష్ట్యా ఎంపీ అర్వింద్ కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఎంతసేపు రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతూ ప్రజలను పక్కదారి పట్టించడం కాకుండా అభివృద్ధి అంశాలపై దృష్టిసారించి, జనాల బాగు కోసం పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం చొరవతీసుకోవడంతోపాటు కేంద్ర సర్కారును సమన్వయం చేసుకొని పెండింగ్ సమస్యను పరిష్కరించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 9 : ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే మా మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. నిజామాబాద్ జిల్లాతో పాటు పక్క జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ వారికి విదేశాలకు వచ్చిపోయే వారికి సౌకర్యంగా ఉంటుంది. జక్రాన్‌పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
-సంకెపల్లి రాములు, జక్రాన్‌పల్లి
జక్రాన్‌పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలి. చుట్టుపక్కల జిల్లాల్లో ముఖ్యంగా బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఉన్నారు. వారందరికీ దూరభారం తగ్గుతుంది. గల్ఫ్ కార్మికులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై శ్రద్ధ చూపాలి.
– గుడాల సాయన్న, లక్ష్మాపూర్