బోధన్ రూరల్/ ధర్పల్లి/ ఆర్మూర్ టౌన్, నవంబర్ 30: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.12 వేల జీవనభృతి అందించాలని డిమాండ్ చేస్తూ పలు మండలాల్లో వ్యవసాయ కార్మికులు శనివారం ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ధర్పల్లి, బోధన్ తహసీల్ కార్యాలయాలను ముట్టడించారు. అంతకు ముందు ఆయా మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని, ఏడాది పొడవునా పని దొరకడం లేదన్నారు. పని దొరికినా ఆదాయం అంతంత మాత్రమే అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు రమేశ్, రాజేశ్వర్, దామోదర్, లింబన్న, కిశోర్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ల సాధనకు సోమవారం కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు
వ్యవసాయ కార్మికులు భారీగా తరలిరావాలని ఏఐపీకేఎంస్ రాష్ట్ర కార్యదర్శి దేవారాం
పిలుపునిచ్చారు. ఆర్మూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దొంగ మాటలు చెప్పి
గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని మండిపడ్డారు.