పొతంగల్, ఫిబ్రవరి 22 : నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాగ్రాజ్ కుంభమేళా యాత్రకు వెళ్లారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఈ యాత్రను ఐదు రోజుల్లో పూర్తిచేయడం విశేషం.
పొతంగల్ గ్రామానికి చెందిన యువకులు సితాల సంతోష్, సాదుల శ్రీధర్ స్నేహితులు, అందరూ కుంభమేళాకు వెళ్తుండడంతో తాము కూడా వెళ్లి రావాలని అనుకున్నారు. 144 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలని నిర్ణయించుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే, అందరిలా వీరు బస్సులు, ట్రైన్లు, కార్లలో కాకుండా ద్విచక్రవాహనంపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 18న పొతంగల్ నుంచి బయల్దేరారు. మొదట ప్రయాగరాజ్కు వెళ్లి నదీస్నానం చేశారు. అనంతరం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకొని తిరుగుప్రయాణమయ్యారు. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 2500 కిలోమీటర్లు చుట్టేసి, శనివారం మధ్యాహ్నం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబీకులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర తమకు ఎంతో సంతోషం కలిగించిందని సదరు యువకులు తెలిపారు.