నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 12: నగరంలోని పెద్దబజార్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన పేలుడు ఘటన టర్పెంట్ ఆయిల్ డబ్బా ద్వారా సంభవించినట్లు సీపీ నాగరాజు స్పష్టం చేశారు. రాజారాం స్టేడియం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించడంతో ఈ ఘటనపై కొందరు సోషల్ మీడియాలో బాంబు, సంఘ విద్రోహశక్తుల కుట్ర పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్, ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు, ఎస్సై పూర్ణేశ్వర్, టాస్క్‌ఫోర్స్ టీమ్ వెంటనే వెళ్లి పరిశీలించారని తెలిపారు. చిత్తు కాగితాలు సేకరించే శంకరగౌడ్కు దొరికిన టర్పెంట్ ఆయిల్ డబ్బాను తెరిచే క్రమంలో పేలుడు సంభవించినట్లు వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో తానుకూడా స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించానని, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించామని తెలిపారు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదంగా వెల్లడించారు. క్షతగాత్రుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించామని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీశైలం, ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు, ఎస్సై పూర్ణేశ్వర్ పాల్గొన్నారు.
హార్వెస్టర్‌లో పడి ఒకరి మృతి
సదాశివనగర్, డిసెంబర్ 12 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామ శివారులో హార్వెస్టర్‌లో పడి వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్‌పల్లికి చెందిన గోపాల్ హార్వెస్టర్‌ను సోమవారం కొందరు రైతులు మక్కజొన్న జూళ్ల నుంచి మక్కలను తీసేందుకు వ్యవసాయ భూముల వద్దకు తీసుకొచ్చారు. మక్కజొన్న జూళ్లను హార్వెస్టర్‌లో వేసేందుకు వజ్జపల్లి గ్రామానికి చెందిన ఒడ్డె లాలు(40) కూలీకి వచ్చాడు.
మక్కజొన్న నుంచి ధాన్యం తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు లాలు హార్వెస్టర్‌లో పడడంతో తల పూర్తిగా నుజ్జునుజ్జయి అక్కడికి అక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రామన్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య లలిత, ముగ్గురు పిల్లలు కల్పన, శిరీష, రాహుల్ ఉన్నారు. లాలు అంత్యక్రియల కోసం హార్వెస్టర్ నిర్వాహకులు రూ. 25 వేలు అందించారు.