బాల్కొండ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేంకటేశ్వర రెడ్డి ( ACP Venkateswara Reddy ) తెలిపారు. బుధవారం బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ( Polling Centres) ఆయన పరిశీలించారు.
నిజామాబాద్ ,కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలోని శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌళికవసతుల గురించి మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, ర్యాంప్, టాయిలెట్స్ తదితర వసతులపై ఆరా తీశారు.
ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం పదవ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు సూచనలు చేశారు. జీవితంలో ఎదగాలంటే విద్యార్థి దశ నుంచే కష్టపడి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై నరేష్, మండల విద్యాశాఖాధికారి బట్టు రాజేశ్వర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.