Etthonda Road | కోటగిరి, ఆగస్టు 21 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన రైస్ మిల్ నిర్మాణం చేపట్టుతున్నారని, రోడ్డు పక్కనే నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, సంబంధింత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు కోనేరు శశాంక్, మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటగిరి-ఎత్తోండ వెళ్లే రోడ్డు కు అనుకోని పక్కనే రైస్ మిల్ నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు పక్కనే రైస్ మిల్ నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో వరి ధాన్యం లారీలు వాహనాలు వచ్చినప్పుడు పార్కింగ్ స్థలం లేక వాహనాలని రోడ్డుపైనే నిలిపే అవకాశం ఉందన్నారు. రోడ్డుకు లారీ లు, వాహనాలు నిలపడం వల్ల వాహనదారులు, ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులై రోడ్డు ప్రమాదం జరిగే ప్రమాదం ఉందన్నారు.
కాబట్టి అధికారులు స్పందించి రోడ్డు పక్కనే నిర్మిస్తున్న రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్ నిర్మాణం పనులను పరిశీలిస్తానని ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ గంగాధర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ పటేల్, హరి తదితరులు పాల్గొన్నారు.