వినాయక్‌నగర్, మార్చి 26: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు బుధవారం హల్చల్ చేశాడు. హత్యాయత్నం కేసులో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చిన సదరు వ్యక్తి పోలీసులకే సవాల్ విసిరాడు. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తపై దాడికి పాల్పడిన నిందితుడు ఇటీవలే కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడు మంగళవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
రేపు(బుధవారం) మధ్యాహ్నం నెహ్రూ పార్కుకు వస్తానని, ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేస్తారా.. అలాగే చేయండని ఐదో టౌన్ ఎస్సైకి సవాల్ విసిరాడు. వీడియోలో చెప్పినట్లే బుధవారం మధ్యాహ్నం నెహ్రూ పార్కుకు వచ్చిన సదరు యువకుడు నడిరోడ్డుపై నిల్చుని మరో సెల్ఫీ వీడియో తీశాడు. ‘నేను వస్తా అన్నాను కదా. వచ్చా. ఐదో టౌన్ ఎస్సై ఇక్కడికి వచ్చి నన్ను ఎన్కౌంటర్ చేయాలని’ ఛాతి కొట్టుకుంటూ సవాల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
నిందితుడిపై కేసు నమోదు..
ఐదో టౌన్ ఎస్సైపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రౌడీషీటర్ షేక్ రసూల్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. భూ తగాదా విషయంలో మాజీ ప్రజాప్రతినిధి భర్తపై దాడి చేసిన కేసులో అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. పాత నేరస్తులకు తరచూ ఇచ్చే కౌన్సెలింగ్‌లో భాగంగా రౌడీషీటర్ రసూల్‌ను కూడా ఠాణాకు పిలిచి సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పినట్లు తెలిపారు.
కానీ నిందితుడు పోలీసులు వేధిస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో పెట్టడం, ఎన్కౌంటర్ చేయండని పోలీసులకు సవాల్ విసరడం వంటివి చేశాడన్నారు. కండీషన్ బెయిల్‌పై వచ్చిన నిందితుడు షరతులు ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే, బైండోవర్ చేసిన రూ.5 లక్షలను జప్తు చేయాలని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు విన్నవించనున్నట్లు ఏసీపీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.