వినాయక్‌నగర్, మార్చి 31: నగరంలోని ఉమెన్స్ కళాశాల వద్ద మూడురోజుల క్రితం ఓ బాలుడి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సరస్వతీ నగర్‌కు చెందిన బోస్టే మాలాబాయి, ఆమె కుమారుడు గోపాల్ బ్రూస్లీగా గుర్తించినట్లు వన్‌టౌన్ హెచ్‌ఎస్‌వో బి. రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నయాబాది తాలూకాకు చెందిన కాశనాథ్ కమలాబాయి తన కుమారుడు కైలాస్(14 నెలలు)తో కలిసి మార్చి 27న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి భిక్షాటన కోసం వచ్చింది. అదే రోజు రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో నిద్రించగా..మధ్యరాత్రి లేచి చూడగా తన కుమారుడు కనిపించలేదు. దీంతో ఆమె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు కంఠేశ్వర్ ఉమెన్స్ కాలేజీ సమీపంలో కైలాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, హత్య కేసు నమోదు చేశారు.
కంఠేశ్వర్ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. సోమవారం నగరంలోని మాలపల్లి ఏరియాలో భిక్షాటన చేస్తుండగా నిందితులైన బోస్టే మాలాబాయి, ఆమె కుమారుడు గోపాల్ బ్రూస్లీని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బాలుడు కైలాస్‌ను తామే హత్యచేసినట్లు ఒప్పుకున్నారు.
కమలాబాయి తన చిన్న కుమారుడైన కైలాస్‌ను అడ్డుపెట్టుకొని భిక్షాటన చేస్తుండడంతో, ఆమెకు తమకన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుండేవని, వారిపై కక్ష పెంచుకొని బాలుడిని హత్యచేసినట్లు నిందితులు అంగీకరించారని ఎస్‌హెచ్‌వో తెలిపారు. నిందితులైన తల్లీకొడుకులపై కేసు నమోదుచేసి,రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఎస్సై రాజేశ్వర్, కానిస్టేబుళ్లు గంగారాం, రాంబాబు, రవిని సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.