నాగిరెడ్డిపేట, జనవరి 20: మాల్తుమ్మెద అంటుమొక్కల, ఉద్యాన వనక్షేత్రంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు మామిడి తోటలకు అంటుకొని క్షేత్రంలోని సగభాగం బుగ్గిపాలయ్యింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై మల్లారెడ్డి అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డి, మెదక్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్షేత్రం అధికారులెవరూ లేకపోవడంతో..దినసరి కూలీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
మామిడి తోటలు, జామా, ఉసిరి తోటలు, గ్రీన్నెట్ షెడ్, డ్రిప్ పరికరాలు, పైల్లైన్లు, బోరు మోటర్లు బుగ్గిపాలయ్యాయి. మిగతా సగం క్షేత్రాన్ని కాపాడేందుకు ఎల్లారెడ్డి అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. క్షేత్రం పూర్తి స్థాయిలో కాలిపోతే రూ.కోట్ల విలువైన సంపద బుగ్గిపాలు అయ్యేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. క్షేత్రంలోని గడ్డి, పండ్ల తోటల ఆకులను ఏడాదికాలంగా తొలగించకపోవడం, అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా క్షేత్రం నేడు దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.