ACB Raids | వినాయక నగర్, నవంబర్ 14 : నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలతో నిత్యం జనాలతో కిటకిటలాడే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ అధికారుల దాడులతో వేల వేల పోయింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కునసాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఏసీబీ బృందం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది ముందుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి లోపల నుండి తాళాలు వేసి, లోపల ఉన్న సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన ఇతరులను బయటికి రాకుండా కట్టడి చేశారు.
అలాగే బయట వ్యక్తులను సైతం సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనికి అనుమతులు ఇవ్వడం లేదు. కార్యాలయంలోని డాక్యుమెంట్ లతోపాటు ఫైళ్లను సైతం ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే నకిలీ రిజిస్ట్రేషన్లు, అక్రమ డాక్యుమెంట్లో పై వచ్చిన ఫిర్యాదుల కారణంగానే ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పలువురు సిబ్బంది ద్వారా తెలిసింది.
క్షణాల్లో తాళాలు వేసి వెళ్లిపోయిన డాక్యుమెంట్ రైటర్లు
అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ బృందం సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలియడంతో ఆ ప్రాంతంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయాల కు హుటా హుటిన తాళాలు వేసి అక్కడనుండి వెళ్లిపోవడం ఆగిపించింది. అప్పటివరకు పలు రిజిస్ట్రేషన్ల పనులపై డాక్యుమెంట్ రైటర్ల వద్దకు వచ్చిన వారిని అక్కడినుంచి పంపించి డాక్యుమెంటు రైటర్లు తమ షాపులకు తాళాలు వేసి పరిసర ప్రాంతాలలో కనిపించకుండా పోయారు.