కాసులు కురిపిస్తోన్న కల్లు బట్టీలు, వైన్‌షాపులు ఆబ్కారీ శాఖలో చక్రం తిప్పుతోన్న కల్లు మాఫియా ముఖ్య నేత పేరును వాడుకుని గలీజు వ్యవహారాలు ఏసీబీ దాడులతో మరోసారి రచ్చకెక్కిన ఎక్సైజ్ శాఖ లోతుగా విచారిస్తే తెరపైకి అక్రమార్కుల గుట్టు రట్టు? తాజా ఘటనలతో ఉమ్మడి జిల్లాలో కుప్ప కూలిన ఆబ్కారీ శాఖ
నిజామాబాద్, జూన్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బరితెగించి వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆబ్కారీలో అవినీతి తారా స్థాయికి చేరింది. మూడు నెలల కాలంలోనే కీలకమైన స్థానాల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. అధికారికంగా ఏసీబీకి చిక్కింది ఇద్దరే అయినప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ రాజకీయ నేతల మెప్పుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారు అనేకులు ఉన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఈ వ్యవస్థ క్షేత్ర స్థాయిలో వ్రేళ్లానుకుని పోయింది. కూకటి వ్రేళ్లతో పెకిలించే దమ్మూ ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు. అవినీతి వాటాల్లో కానిస్టేబుళ్ల దగ్గరి నుంచి ఉన్నతాధికారుల వరకు పాత్రధారులే కావడం ఇందుకు బలమైన కారణంగా నిలుస్తోంది. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో కల్లు మాఫియా చెలరేగి పోతోంది. ఇబ్బడి ముబ్బడిగా ఆల్ఫాజోలం నిషేధిత పదార్థాన్ని సరఫరా చేస్తూ కల్లుబట్టీలను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఎక్సైజ్ శాఖకే సవాల్ విసురుతున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక నేత పేరు వాడుకుని కొంత మంది ప్రభుత్వ వ్యవస్థలకే కొరకరాని కొయ్యగా మారారు. మాట వినని ఆబ్కారీ అధికారులను ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ ఛాలెంజ్ వేసే స్థాయికి కల్లు మాఫియా మారడం వీస్తూ గొల్పుతోంది. అక్రమార్కులకు తెర వెనుక రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉండటంతో అడ్డే లేకుండా పోయింది.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలో మొత్తం 11 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అందులో నిజామాబాద్ జిల్లా ఆబ్కారీ కార్యాలయంలో పలు కీలక సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కల్లు మాఫియా, వైన్ షాపుల యజమానులు నుంచి భారీ ఎత్తున మామూళ్ల చిట్టా లెక్కలు ఉన్నట్లుగా గుర్తించారు. తరచూ కార్యాలయానికి వచ్చి వెళ్తున్న కల్లు మాఫియా కింగ్‌పై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సదరు మాఫియాకు నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో ఆయన జోలికి ఏసీబీ వెళ్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లారెడ్డిని ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా ఈ కేసులో మరింత అధ్యయనం చేస్తే అసలు గుట్టు రట్టు కానుంది. వసూళ్ల పర్వం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించి ఉన్నదో? తేటతెల్లం కానుంది. ఆల్ఫాజోలం అక్రమ రవాణా, గంజాయి స్మగ్లర్ల ఆగడాలను అరికట్టకపోవడానికి కారణాలు సైతం వెలుగు చూసే వీలుంది. ఆల్ఫాజోలం విచ్చలవిడిగా వ్యాప్తి కావడానికి కల్లు మాఫియాలో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తులతో ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య ఉన్న డీలింగ్స్‌ను ఏసీబీ ఛేదిస్తే అసలు కథ వెల్లడి కానుంది. వివాదాస్పద అధికారిగా పేరొందిన ఓ సీఐ ఆగడాలపైనా ఏసీబీ విచారణ చేస్తే ప్రక్షాళన పరిపూర్ణం అవుతుందని పలువురు అంటున్నారు. మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సొంత శాఖలోని సిబ్బందే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తమ బదిలీలకు ఉన్నతాధికారులే కారణమని గుర్తించి మామూళ్ల సమాచారాన్ని పక్కాగా ఏసీబీకి ఇచ్చి దాడులు చేయించినట్లుగా ప్రచారం జోరందుకుంటోంది. ఈ అక్రమ వ్యవహారంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటుగా మిగిలిన వాళ్ల కూపి లాగితే మరి కొంత మంది ఇంటి దొంగలు వెలుగు చూసే వీలుంది. కల్లు మాఫియాను కట్టడి చేసేందుకు ఆస్కారం లభించనుందని ప్రజలు భావిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ కుప్ప కూలింది. నెలల వ్యవధిలోనే అవినీతి, అక్రమాలతో శాఖ పరువు గంగలో కలిసింది. కొంత మంది అక్రమార్కుల తీరుతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మామూళ్ల వసూళ్లకు తెగబడటంతోనే ఈ దారుణ పరిస్థితి ఎదురైంది. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్ దాకా ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు తాజాగా వెలుగు చూస్తోన్న ఘటనలే ఉదాహారణగా నిలిచాయి. జనవరి 23న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి స్మగ్లర్లు హతమార్చారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మాధవనగర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా కారుతో గుద్ది చంపేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం ఉన్నదన్న ప్రచారం జరిగింది. కానీ తెరపైకి ఎవ్వరి పేర్లు వెల్లడి కాలేదు. ఆ తర్వాత ఏప్రిల్‌లో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ సత్యానారాయణ ఓ వ్యక్తి నుంచి రూ.2లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. కొద్ది రోజుల క్రితమే కింది స్థాయి సిబ్బందిని కమిషనర్ ఏక మొత్తంలో బదిలీ వేటు వేశారు. జిల్లా దాటించి విధులు అప్పగించారు. నెలన్నర క్రితం ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్‌కు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నోటికొచ్చిన బూతులు తిట్టడంతో డీసీ స్పృహ తప్పి పడిపోగా దవాఖాన పాలయ్యారు. ఇన్ఛార్జీ డీసీ పాలనలో ఉమ్మడి జిల్లా కొనసాగింది. సీన్ కట్ చేస్తే తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఏకంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడి జైలుకు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.