బిచ్కుంద, మే14: బిచ్కుంద పోలీసు స్టేషన్లో బుధవారం ఏసీబీ అధికారుల సోదాలు కలకలం సృష్టించింది. సుమారు పది గంటల పాటు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మంజీర పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వదిలేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ స్థానిక విలేకరులకు తెలిపారు. తనిఖీల్లో పోలీస్‌స్టేషన్ ఆవరణలో పది ఇసుక ట్రాక్టర్లను గుర్తించినట్లు చెప్పారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలివేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు, రెగ్యులర్‌గా ఇసుక తరలిస్తున్న వారి నుంచి వసూళ్లతోపాటు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించినట్లు వివరించారు. సోదాల్లో పలు ఆధారాలు లభించినట్లు చెప్పా రు. తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
ఇది ట్రాప్ కేసుకాదని ఆకస్మిక తనిఖీలు మాత్రమేనని డీఎస్పీ తెలిపారు. మంజీరా నది నుంచి చాలా రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. కొందరు ఫిర్యాదు చేయడానికి వచ్చి భయపడి వెనక్కి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే టోల్‌ఫ్రీ 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.