నిజామాబాద్ కార్పొరేషన్లో ఏండ్లుగా పాతుకుపోయి అక్రమంగా రూ.కోట్లు కొల్లగొట్టిన సూపరింటెండెంట్, ఇన్చార్జి రెవెన్యూ అధికారి నరేందర్ వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా విచారిస్తున్నది. దశాబ్ద కాలంగా ఒకే చోట తిష్ట వేసుకుని అతగాడు సాగించిన అరాచకాలకు ఎవరెవరు సహకరించారనే దానిపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. మరోవైపు, బల్దియాలో జరుగుతున్న అవినీతి బాగోతాలపైనా నిఘా పెట్టినట్లు సమాచారం. నరేందర్ ఆగడాలపై వెల్లువలా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాదాపుగా ఏడాది నుంచే ఏసీబీ కన్నేసి ఉంచినట్లు తెలిసింది.
అనువైన సమయం కోసం వేచి చూస్తున్న అధికారులు.. పక్కా సమాచారం రావడంతో ఈనెల 9న ఏక కాలంలో దాడులు చేశారు. ఈ క్రమంలో లభ్యమైన నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన అతి భారీ అవినీతి కేసు ఇదే అని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, శనివారం రోజంతా నరేందర్ వ్యవహారంపైనే జోరుగా చర్చ జరిగింది. నగర పాలక సంస్థలో తమకు ఎదురైన ఇబ్బందులను, ఇచ్చుకున్న ముడుపులకు సంబంధించిన అనుభవాలను బాధితులు గుర్తు చేసుకుంటూ ‘పాపం పండింది’ అంటూ సంతోషం వ్యక్తం చేయడం కనిపించింది.
-నిజామాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మున్సిపల్ ఉద్యోగి వద్ద ఏకంగా రూ.కోట్ల లో ఆస్తులు బహిర్గతం కావడంతో, అతడికి అండదండలు అందించిన వారిపైనా ఏసీబీ నజర్ పెట్టినట్లు తెలిసింది. నరేందర్తో కొందరు ఉన్నతాధికారులు అంటకాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం జరిగిన సోదాల్లో మున్సిపల్ కార్పొరేషన్లోని నరేందర్ చాంబర్లో రూ.90వేలు నగదు పట్టుబడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ మొత్తాన్ని కార్యాలయంలోనే మరో అధికారికి ఇచ్చేందుకే సిద్ధం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ బల్దియాలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ మరింత లోతైన దర్యాప్తునకు సిద్ధమైంది.
అక్రమాలను సక్రమం చేసేందుకు రాజకీయ నాయకులు, రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లతో చేతులు కలిపి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు కళ్లు మూసుకుని నరేందర్ ఏది చెబితే దానికి తలూపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. కళంకిత ఉద్యోగిని నమ్మి మిగిలిన విభాగాల బాధ్యతలను అప్పగించి పెత్తనం చెలాయించేందుకు అవకాశాన్ని కల్పించడంలో ఉన్నతాధికారుల ఉద్దేశం ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఖాళీ జాగాలను కాజేయడం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడం, అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఎక్కువగా వసూళ్లు జరిగినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా చేసే ప్రతి పనిలో కార్పొరేషన్ ఉన్నతాధికారులకు సైతం వాటాలు ఇస్తున్నట్లు నరేందర్ ప్రచారం చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే వాడని బాధితులు బహిరంగంగానే చెబుతున్నారు. రెండు వారాల క్రితమే నగరంలో పలు హోటళ్లపై దాడులు నిర్వహించగా, అందులోనూ భారీగా ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాడులను ఆపేసి మిగిలిన హోటళ్ల నుంచి వసూళ్లు చేస్తున్న క్రమంలోనే ఏసీబీ సోదాల్లో సదరు వ్యక్తి అరెస్ట్ కావడంతో హోటల్ యాజమాన్యాలు సైతం ఊపిరి పీల్చుకున్నాయి.