nizamabad | వినాయక్ నగర్, ఏప్రిల్ 2 : నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. రోడ్డు పక్కన జనాలు చూస్తుండగానే ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడితో గొడవపడి అతనిపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. బుధవారం సాయంత్రం అరవడం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ గౌస్ అనే యువకుడితో మరో ముగ్గురు యువకులు పాత కక్షల కారణంగా గొడవకు దిగారు. గొడవ జరుగుతున్న క్రమంలో ముగ్గురులోంచి ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తిని తీసి గౌస్ కడుపులో మూడు చోట్ల పొడిచాడు.
ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన షేక్ గౌస్‌ను స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడికి పాల్పడిన యువకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆరో ఠాణా పరిధిలో రెండు రోజుల వ్యవధిలో మూడు కత్తిపోట్ల ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా ఇలాంటి ఘటనాలను సంబంధిత పోలీసులు నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.