బోధన్ రూరల్, ఆగస్టు9: అజాద్కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలను నాటాలని డీఆర్డీవో చందర్‌నాయక్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 15లోపు అన్ని గ్రామాల్లో వెయ్యి మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం గ్రామాల వారీగా సమీక్షించారు. నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బోధన్ ఎంపీడీవో పర్బన్న, ఎంపీవో మధుకర్ ఏపీవో అల్తాప్, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.
మొక్కల పరిశీలన
ఎడపల్లి, ఆగస్టు9: మండలంలోని ఠానాకలాన్లోని సంపద వనంలో పెంచుతున్న మొక్కలను డీఆర్డీవో చందర్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇరిగేషన్ ల్యాండ్, కెనాల్ ప్రాంతంలో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఇరిగేషన్ శాఖ సమన్వయంతో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ఇరిగేషన్ ల్యాండ్‌ను సర్వే చేసి కెనాల్ ప్రాంతంలో వృక్ష సంపదను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంపద వనాలు, దశాబ్ది వనాలుగా నామకరణం చేసినట్లు తెలిపారు. సంపద వనంలో 1000 మొక్కలను పెంచడంతోపాటు వాటిలో అధిక మొత్తంలో పండ్ల మొక్కలు నాటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గోపాలకృష్ణ, ఏపీవో శ్రీవల్లి, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.
ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలి
ఏర్గట్ల, అగస్టు 9: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఇన్చార్జి ఎంపీడీవో శివచరణ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యం మేరకు గ్రామాల్లో ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించి, గుంతలు తవ్వాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఏపీవో వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ ప్లాంటేషన్‌కు స్థలం సేకరించాలి
మోర్తాడ్, ఆగస్టు9: ప్రతి గ్రామంలో కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం స్థలాన్ని సేకరించాలని ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో పదెకరాల పండ్లతోటలు ఈజీఎస్‌లో నాటించాల్సి ఉందని, పండ్లతోటలు పెంచుకునేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీధర్, ఏపీవో శకుంతల, కార్యదర్శులు, ఫీల్డ్అసిస్టెంట్లు పాల్గొన్నారు.