కంఠేశ్వర్, సెప్టెంబర్ 12 : ఎట్టకేలకు జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ (దిశ) సమావేశం జరగనున్నది. ఎంపీ ధర్మపురి అర్వంద్ అధ్యక్షతన నిర్వహించాల్సిన ఈ సమావేశం చాలా రోజులుగా పెండింగ్లోనే ఉన్నది. ఈ నేపథ్యంలో దిశ మీటింగ్ నిర్వహించడంలేదని నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘పత్తా లేని దిశ’ శీర్షికన ఆగస్టు 18న కథనం ప్రచురితమైంది.
ఈ కథనంలో ఎంపీ అర్వింద్ నిర్లక్ష్యాన్ని సైతం ఎండగట్టింది. అధికారుల నుంచి ఒత్తిడి రావడం, దిశా మీటింగ్ నిర్వహణలో తీవ్ర జాప్యం ఏర్పడడంతో ఎట్టకేలకు ఎంపీ అర్వింద్ సమయం కేటాయించడంతో ఈనెల 16న దిశా మీటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10.30 గంటలకు ఎంపీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.