శక్కర్‌నగర్, అక్టోబర్ 15: బోధన్ పట్టణ శివారులోని ఆచన్‌పల్లి శ్రీనివాసనగర్ ప్రాంతం లో ఈ నెల 14 అర్ధరాత్రి తర్వాత తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండుగులు భారీ చోరీకి పాల్పడారు. రూ. 50 లక్షల నగదుతోపాటు 20 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లి, మరో మూడు ఇండ్ల లో చోరీకి యత్నించారు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన శాఖమూరి వెంకటేశ్వర్రా వు అనే వడ్ల వ్యాపారి సొంత పని నిమిత్తం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. మంగళవారం తెల్లవారు జామున తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు తెరిచి ఉండడం, లోపల సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించాడు.
తన వ్యాపారం కోసం రైతులకు చెల్లించేందుకు చేబదులుగా తెచ్చుకున్న రూ.50లక్షలతోపాటు ఇంట్లోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని దుండుగులు పక్కనే మరో మూడు ఇండ్లలో చోరీకి యత్నించారు. ఓ కుటుంబం నిద్రిస్తున్న గదికి బయటి నుంచి గడియ పెట్టి ఇంట్లో నుంచి రూ.50 వేలు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో రెండు ఇండ్లలో చోరీకి యత్నించగా ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు.బాధితుల ఫిర్యాదు మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట నారాయణ ఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.