నిజామాబాద్, జూలై 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ప్రభుత్వ ఉద్యోగం కొంత మందికి ఆదాయ వనరుగా మారింది. ప్రజా సేవ పేరుతో ప్రభుత్వ నౌకరి చేపట్టి ఆస్తులు పెంచుకుంటున్నారు. అక్రమ సంపాదనతో అడ్డగోలుగా భూములు, విల్లాలు, విలాసాలకు ఎగబడుతున్నారు. పేద ప్రజలపై కనీసం దయ, దాక్షిణ్యం లేకుండా డబ్బులు వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ దొంగలకు పోటీగా కొంత మంది ఉద్యోగులు నిలుస్తున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహిస్తోన్న సోదాలు, ఆకస్మిక దాడుల్లో ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తోన్న ఆస్తుల చిట్టా ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తోంది. వివిధ శాఖల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన అధికారగణం ఇబ్బడి ముబ్బడిగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన దాఖలాలు వెలుగు చూశాయి. అందులో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బయట పడిన ఘటనలు ఎక్కువగా ఉండటం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు ఏసీబీ దాడి జరిగినా నిజామాబాద్ ప్రాంతానికి లింకులు బయట పడుతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూములను కొనుగోలు చేసి ఫాం హౌస్‌లు నిర్మించుకోవడం, ట్రెండింగ్ వ్యాపారులు స్థాపించడం, భారీ వ్యాపారాల్లో వాటాలు కొనడం, విల్లాలు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితానికి బాటలు వేసుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. నీతి, నియమాలు తప్పి పూర్తిగా అక్రమ సొమ్ముతో జల్సాలకు పాల్పడుతోన్న లంచగొండి అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. కేసులు పెట్టి చేతులు దులుపుకోకుండా కఠిన శిక్షలు పడేలా ఏసీబీ కృషి చేయాలని సామాన్యులు సూచిస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లంచాలు తీసుకుంటూ, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో 20మందికి పైగా ఏసీబీకి దొరికారు.
ఒక శాఖలో లంచం తీసుకుంటూ ఏసీబీకి ఓ ఉద్యోగి పట్టుబడితే కాసింత భయమన్నది ఉండాలి. కానీ చాలా మందిలో అలాంటి బెరుకు కనిపించడం లేదు. దొరికితే దొంగ… లేదంటే దర్జాగా అవినీతి, అక్రమాలతో జల్సా చేసుకోవచ్చనే స్థాయిలో విర్రవీగుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో గతేడాది లంచంతో ఒక ఎస్సై, కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. మూడు నెలలు గడవక ముందే అదే సీట్లో మరో ఎస్సై లంచంతోనే ఏసీబీకి దొరకడం ఉదాహారణగా నిలుస్తోంది. ఇదొక్కటే కాదు… రెవెన్యూ, రిజిష్ర్టేషన్ శాఖలో ఇలాంటి బరితెగింపు ఎక్కువగా కనిపిస్తోంది. ఆరు నెలల క్రితం లంచంతో ఓ సబ్ రిజిస్ట్రార్ దొరికాడు. ఆ తర్వాత తీరు మారుతుందనుకుంటే వ్యవస్థ షరామామూలే అన్నట్లుగా నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారాలు మరింత బరితెగించాయి తప్పా తగ్గుముఖం పట్టలేదని ప్రజలు వాపోతున్నారు. పురపాలక శాఖలో గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న నరేందర్ అనే ఉద్యోగి ఏకంగా రూ.కోట్ల రూపాయల నోట్ల కట్టలతో ఏసీబీకి చిక్కాడు. ఆ శాఖలో తీరు మారిందా అంటే మొన్నటి మొన్న ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు రూ.2లక్షల లంచంతో దొరికాడు. పంచాయతీ శాఖలో సెక్రటరీలు అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీరికి తోడుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారుల బరితెగింపు బహిరంగంగానే చెలరేగిపోతోంది. జిల్లా పంచాయతీ కార్యాలయం(డీపీవో)లో అంతులేని అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచింది. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖలో ఓ సీఐ లంచంతో పట్టుబడిన కొద్ది కాలానికే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దొరికాడు. రోడ్డు భవనాల శాఖ, ఇంజనీరింగ్ శాఖలో కీలక ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఇంజనీర్లు రూ.వందల కోట్లు పోగేసుకున్నారు.
ప్రజల రక్తం తాగి సంపాదిస్తోన్న అవినీతి సొమ్ముతో అక్రమార్కులు జల్సాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అవినీతి అధికారులు చాలా మంది విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టారు. విలువైన వాహనాలు, రూ.లక్షలు విలువ చేసే చేతి గడియరాలు, విదేశీ మద్యం, బంగారం, వెండి, వజ్రాభరణాలు వంటివి వెలుగు చూశాయి. భార్య, పిల్లలు, కోడళ్లు, అల్లుళ్ల పేరిట అక్రమంగా విల్లాలు, విలువైన గేటెడ్ కమ్యూనిటి ఇళ్లు, ప్రధాన రహదారుల వెంట ఖాళీ జాగాలు, వ్యవసాయ భూములు కొంటున్నారు. నగరం, పట్టణ కేంద్రాలతో పాటుగా హైదరాబాద్ శివారులో వ్యవసాయ భూములు కొని హంగు ఆర్భాటాలతో ఫార్మ్ హౌస్‌లు నిర్మించుకుని దర్పం ప్రదర్శిస్తున్నారు. అక్రమ సొత్తుతో విదేశీ టూర్లకు షికారు చేసి ఎంజాయ్ చేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో అక్రమాలకు కొదువే లేకుండా పోయింది. వ్యవసాయ భూముల రిజిష్ర్టేషన్ కోసం కొంత మంది అధికారులు డబ్బులకు ఆశ పడి జనాలను వేధిస్తున్నారు. అదనంగా డబ్బులివ్వకపోతే నాన్చి పెడుతున్నారు. ఏదో ఒకటి కొర్రీలు పెట్టి తప్పించుకుంటున్నారు. చేసేది లేక అదనంగా లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. వివాదాస్పద భూముల విషయంలో కొంత మంది తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్ డివిజన్లో భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా కలెక్టర్ గుర్తించారు. ఈ మేరకు ఓ తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇసుక అక్రమ వ్యవహారాల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట పక్కదారి పట్టిస్తున్న తీరును పసిగట్టి ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. రికార్డులను తారుమారు చేసిన ఘటనలో ఓ సీనియర్ అసిస్టెంట్ సైతం ఈ మధ్యనే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గడిచిన నెల రోజుల్లో రెవెన్యూ శాఖలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు తీవ్రమైన ఆరోపణలతో విధులకు దూరం అయ్యారు. కలెక్టర్ ఆగ్రహానికి కారణమై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ముగ్గురితో పాటుగా ఎంతో మంది చాప కింద నీరులా అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక, మొరం దందా విషయంలో అనేక మందిపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని ప్రజలు భావిస్తున్నారు.