Ayyappa Diagnostics | ఖలీల్‌వాడి, మే 29: తీగ లాగితే డొంక కదిలిన చందంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత విచారణ చేపట్టారు. నిందితుడి మొబైల్ నుంచి సేకరించిన డాటాను హార్డ్ డిస్క్‌లో భద్రపరిచినట్లు సమాచారం. నిందితుడు ప్రశాంత్ మొబైల్‌ను పోలీసులు పరిశీలించగా అశ్లీల వీడియోలు, రాసలీలలు, స్కానింగ్ చిత్రాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మొదట ఒక్కరే బాధితురాలు అనుకున్న పోలీసులు.. మొబైల్‌ను పరిశీలించిన తర్వాత ఖంగుతిన్నారు. ఒక్కరు కాదు వందల సంఖ్యలో మహిళల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. తన మొబైల్ నుంచి ఫొటోలు, వీడియోలను నిందితుడు ఇతరులకు ఏమైనా పంపించాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఎంతమంది మహిళలను బ్లాక్మెయిల్ చేశాడో తెలుసుకుంటున్నారు. సారంగాపూర్‌కు చెందిన ప్రశాంత్ కొన్నేండ్లుగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. స్కానింగ్ కోసం వచ్చే మహిళల్లో రోజుకు ఐదుగురి నుంచి 15 లేదా సగం మంది వీడియోలను చిత్రీకరించినట్లు తెలిసింది. స్కానింగ్ సెంటర్లో సీక్రెట్ కెమెరా పెట్టి దాని ద్వారా ఫొటోలు, వీడియోలు తీసేవాడని సమాచారం. ముందుగా స్కానింగ్ సెంటర్లకు వచ్చే యువతులను దుస్తులు మొత్తం విప్పితేనే పక్కాగా రిపోర్టు వస్తుందని నమ్మించి సీక్రెట్ కెమెరాతో బంధించేవాడని, వివరాల నమోదు సమయంలో మహిళలు ఇచ్చే మొబైల్ నంబర్లను తీసుకొని..
ప్రశాంత్ తీసిన అశ్లీల ఫొటోలు, వీడియోలను పంపించి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. శారీరకంగా వాడుకోవడంతోపాటు డబ్బులు తీసుకుంటూ వదిలేసేవాడని సమాచారం. కొంతమంది గర్భిణులకు లింగనిర్ధారణ చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.ఈ నెల 5న ఓ మహిళ స్కానింగ్ కోసం సెంటర్‌కు వెళ్లింది. ఆ తర్వాత ప్రశాంత్ ఆమె ఫోన్‌కు అశ్లీల ఫొటోలు పంపించాడు. ఆ మహిళ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో ప్రశాంత్‌ను పట్టుకొని చితకబాదారు. ఈ విషయం స్కానింగ్ సెంటర్ యాజమాన్యానికి తెలియడంతో మహిళ కుటుంబసభ్యులను బుజ్జగించి పంపించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేయడంతో తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం పోలీసులు సేకరించిన డాటా విషయాలు కలెక్టర్‌కు తెలియడంతో అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్‌ను ఆదేశించారు. దీంతో స్కానింగ్ సెంటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి ప్రత్యేక కమిటీని వేశారు. ఈ కమిటీ వారంరోజుల్లో నివేదిక తయారుచేసి కలెక్టర్‌కు అందజేయనున్నది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు స్కానింగ్ సెంటర్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన సంబంధిత సంఘాల నేతలు.. అసలు విషయం బయటికి రావడంతో సైలెంట్ అయ్యారు.
మహిళల వీడియోలు తీసిన నిందితుడిపై కేసు నమోదు చేశాం. మిగతా స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నాం. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. స్కానింగ్ సెంటర్లకు వెళ్లే మహిళలు అనుమానం వస్తే వెంటనే డాక్టర్లకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. స్కానింగ్ సెంటర్లలో మెడికల్ సిబ్బందిని మాత్రమే ఉంచాలి. నాన్ మెడికల్ సిబ్బందిని అనుమతించకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డాక్టర్లు తగిన జాగ్రత్తలు పాటించాలి.