కంఠేశ్వర్, ఆగస్టు 15 : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అయోమయం నెలకొన్నది. వివిధ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపించింది. దీంతో వేడుకలు తిలకించేందుకు వచ్చినవారంతా అసహనానికి గురయ్యారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.. జిల్లా ప్రగతిపై అధికార యంత్రాంగం ధృవీకరించిన ప్రసంగాన్ని పక్కన పెట్టి సొంతంగా మాట్లాడడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రసంగ కాపీలను చేతిలో పట్టుకున్న వారందరూ గందరగోళానికి గురయ్యారు. ఇదిలాఉండగా స్వాతంత్య్ర పోరాటం, గాంధీ హత్యపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. కొన్ని శాఖల స్టాళ్లు లేకపోవడం, ఏర్పాటు చేసిన స్టాళ్లలో సరైన సమాచారం లేకపోవడంతో ప్రముఖులు, విద్యావంతులు, విద్యార్థులు నిరాశగా వెనుదిరిగారు. వేడుకలను తిలకించేందుకు తక్కువ సంఖ్యలోనే జనం వచ్చారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం నిరాశకు గురయ్యారు. ప్రశంసాపత్రాలను ఒక్కొక్కరికీ ఇవ్వకుండా.. శాఖలో ఉన్న ఉద్యోగులందరికీ కలిపి ఒకేసారి ఇవ్వడంతో అసహనానికి గురయ్యారు. అధికారికి ప్రశంసాపత్రం చాలా విలువైనదని, అది వ్యక్తిగతంగా అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం కలెక్టర్ అయినా ఇవ్వాలని అడిగిన కొందరికి నిరాశే ఎదురైంది. చీఫ్ గెస్ట్ వెళ్లిపోయారని, ఆయనే ఇస్తే బాగుంటుందని కలెక్టర్ అనడంతో ఉద్యోగులు నిరాశతో వెనుదిరిగారు. చేసేదేమీ లేక పలువురు ఉద్యోగులు తమ శాఖల అధికారులతో ప్రశంసాపత్రాలు స్వీకరించి ఫొటోలు తీసుకోవడం కనిపించింది.