నందిపేట్, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. కానీ స్థానికంగా తలెత్తే సమస్యలతో అప్పుడప్పుడు కరెంట్ పోతున్నది. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మొదటి విడుతగా నిజామాబాద్ జిల్లాలో 71 అర్బన్ ప్రాంతాలు, గ్రామాలు ఎంపిక చేసి, ట్రాన్స్‌కో ఇంజినీర్లు దత్తత తీసుకున్నారు. రూ. 8.09 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఓవర్ లోడ్ ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, శిథిలావస్థకు చేరిన చోట కొత్త గద్దెలు నిర్మించడం, ఎర్తింగ్, విద్యుత్ వైర్లను సరిచేయడం, స్తంభాలను సరి చేయడం, శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతున్నారు. పైస్థాయిలో ఏవైనా సాంకేతిక లోపాలు వస్తే తప్ప స్థానికంగా ఏ సమస్య రాకుండా ఉండేందుకు ఆధునీకరణతో లైనింగ్ ప్రక్రియను చక్కదిద్దుతున్నారు.
రానున్న రోజుల్లో రెప్పపాటు కాలం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ట్రాన్స్‌కో ప్రత్యేక కా ర్యాచరణ రూపొందించింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు అందించే విద్యుత్ సరఫరాలో వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా ట్రాన్స్‌కో యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొదటగా జిల్లాలో అర్బన్ ప్రాంతాలు, గ్రామాలు కలుపుకొని 71 గ్రామాలను గుర్తించారు. వీటిని ట్రాన్స్‌కో ఏఈ, ఏడీ, డీఈలు దత్తత తీసుకున్నారు. మొదటి విడుతగా ఈ గ్రామాల్లో ఆధునీకరణ పనులు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చిన ఫలితాలతో మిగతా అన్ని గ్రా మాల్లోనూ అంతరాయం లేని సరఫరా అందించేందుకు కింది నుంచి పైస్థాయి అధికారుల వరకు కలిసి పనిచేస్తున్నారు. సరఫరాలో ఉన్న లోటుపాట్లు, పురాతన లైనింగ్ వ్యవస్థ, ఈదురు గాలుల తీవ్రతకు వైర్లు ఒకదానికి ఒకటి తగిలి మంటలు రావడం, లైన్లకు చెట్ల కొమ్మలు అడ్డురావడం, సరైన గద్దెలు లేక ట్రాన్స్ఫార్మర్లు పక్కకు ఒరిగిపోవడం, శిథిలావస్థకు చేరిన స్తంభాలు పడిపోవడం, లోడ్ పెరిగినప్పటికీ పాత ట్రాన్స్ఫార్మర్లతోనే కాలం వెల్లదీయడం ఇలా ఆయా కారణాల రీత్యా తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం పరిపాటిగా మారుతున్నది. పైస్థాయిలో ఏవైనా సాంకేతిక లోపాలు వస్తే తప్ప స్థానికంగా ఏ సమస్య రాకుండా ఉండేందుకు ఆధునీకరణతో లైనింగ్ ప్రక్రియను చక్కదిద్దుతున్నారు.
ఏఈ నుంచి డీఈ వరకు…
జిల్లాలో ఉన్న ట్రాన్స్‌కో ఇంజినీర్లు ఏఈ నుంచి డీఈ స్థాయి వరకు ఒక్కొక్కరు ఒక్కో గ్రామం, అర్బన్‌లో కాలనీలను దత్తత తీసుకున్నారు. గ్రామాలతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ నగరంలో కాలనీలను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న అధికారి పనులు పూర్తయ్యే వరకూ బాధ్యతగా పనులను పర్యవేక్షించాలి. ఆ అధికారి ఈ ప్రాంత సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను గుర్తించి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో గుర్తించి అంచనాలు వేశారు. ఇప్పుడు ఆ ప్రకారంగా పనులు జరుగుతున్నాయి.
రూ. 8 కోట్ల 9 లక్షల వ్యయంతో..
ఓవర్ లోడ్ ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు శిథిలావస్థకు చేరిన చోట కొత్తగా పిల్లర్ వేసి గద్దెలు నిర్మిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లకు ఉండే ఏ,బీ స్విచ్‌లు ఎక్కడైనా చెడిపోయి ట్రాన్స్ఫార్మర్ ఆన్,ఆఫ్ కాకపోతే వాటి స్థానంలో కొత్త స్విచ్‌లు అమర్చడం, ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ సరిచేయడం, వదులుగా ఉన్న విద్యుత్తు వైర్లను లాగి సరిచేయడం, అంతేకాకుండా భూమి నుంచి తక్కువ ఎత్తులో ఉన్న లైన్లను పైకి లేపడం, భూమి నుంచి ఎల్టీ లైన్ 19 ఫీట్లు, 11 కేవీ లైన్ 20 ఫీట్ల ఎత్తులో ఉండేలా.. ఎత్తు తక్కువ ఉన్న స్తంభాల స్థానంలో ఎక్కువ ఎత్తు ఉన్న కొత్త స్తంభాలను మారుస్తున్నారు.
వంగిపోయిన స్తంభాలను సరిచేయడం, తుప్పుపట్టి చెడిపోయిన ఇనుప స్తంభాలు, శిథిలావస్థకు చేరిన సిమెంట్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయడం. స్తంభాలకు సపోర్ట్ వైర్ ఏర్పాటు, ఈదురు గాలులు వచ్చినప్పుడు చెట్లు లైన్లకు తాకకుండా చెట్ల కొమ్మలను తొలగించడం, సామర్థ్యం పెరిగిన చోట అవసరాన్ని బట్టి కొత్తగా ట్రాన్స్పార్మర్ల ఏర్పాటు చేయడంతో పాటు పాత ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోకపోతే దాని స్థానంలో ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను అమర్చడం తదితర పనులు చేస్తున్నారు. ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్ లైన్ల వల్ల ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ పనులకు గాను రూ. 8 కోట్ల 9 లక్షలు వెచ్చిస్తున్నారు.
నందిపేట్ మండలంలో 3 గ్రామాలు
నందిపేట్ మండలంలో మూడు గ్రామాలకు అవకాశం దక్కింది. ఏఈ జ్ఞానేశ్వర్ ఉమ్మెడ గ్రామం, ఏడీ అశోక్ అయిలాపూర్, డీఈ ఎం.శ్రీనివాస్ నందిపేట్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. స్థానిక ఏఈ జ్ఞానేశ్వర్ ప్రత్యేక శ్రద్ద వహించి కృషి చేయడంతో మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. ఒక్క మండలంలో మూడు గ్రామాల్లో విద్యుత్ ఆధునీకరణ పనులు జరగడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా పనులు పూర్తి
దత్తత తీసుకున్న గ్రామాల్లో జరుగుతున్న పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ పనులతో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి ఆస్కారం ఉండదు. ఈ దత్తత గ్రామాల ఫలితాల బట్టి మిగిలిన మిగతా గ్రామాల్లో పనులు చేపడతాం.
–ఆర్.రవీందర్, ట్రాన్స్‌కో ఎస్ఈ, నిజామాబాద్