విష జ్వరాలు వెంటాడుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఒక వైపు.. పారిశుద్ధ్య లోపం మరోవైపు ప్రజలను రోగాలపాలు చేస్తున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా రోగులు దవాఖానలకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మందులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా… ప్రైవేటు దవాఖానలకు కాసులు కురిపిస్తూ పేదల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
– ఖలీల్వాడి, ఆగస్టు 28
ఉమ్మడి జిల్లాలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేవలం 28 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో నమోదైన కేసుల చూస్తేనే భయాందోళనలు నెలకొంటున్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి అంటూ జనం దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 415 డెంగీ కేసులు నమోదు కాగా, ఒక్క ఆగస్టు నెలలోనే 269 కేసులు నమోదైట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నెలలో అత్యధికంగా ఇందల్వాయి పీహెచ్సీ పరిధిలో 54, ముదక్పల్లి పీహెచ్సీ పరిధిలో 50 కేసులు, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ పురపాలక సంస్థల్లో 165 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా విష జ్వరాలతో అతలాకుతలమవుతున్నది. రామారెడ్డి, సదాశివనగర్, లింగంపేట్, పిట్లం తదితర మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వైరల్ ఫీవర్తో సతమతమవుతున్నారు.
గాంధారి మండలంలోని కొన్ని తండా లు మంచంపట్టాయి. సదాశివనగర్ మండలంలో ఇటీవల విషజ్వరంతో ముగ్గురు మృ తి చెందిన విషయం తెలిసిందే. గ్రా మీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం ప్రజలను రోగాలపాలు చేస్తున్నది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి దో మలు విజృంభిస్తున్నాయి. నెల రోజుల నుంచి ఆయా గ్రామాల్లో ప్రజలు మంచా న పడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
విష జ్వరాలు ప్రైవేటు దవాఖానలకు కాసులు కురిపిస్తున్నాయి. జ్వరం, డెంగ్యూ బాధితులతో ప్రైవేటు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. కొన్ని దవాఖానల్లో వైరల్ ఫీవర్తో వచ్చిన రోగులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. దీంతో రక్తకణాలకు డబ్బులు కట్టలేక రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు.
ఇంటి ఆవరణను శు భ్రంగా ఉంచుకోవాలి. లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకూడదు. వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేసుకోవద్దు. జ్వరం తీవ్రత మేరకు పరీక్షలు చేయించుకోవాలి. వేడి ఆహారం తీసుకోవాలి.
– డాక్టర్ జలగం తిరుపతిరావు, మెడికల్ కళాశాల ప్రొఫెసర్
ప్రతి శుక్రవా రం గ్రామాల్లో డ్రై డే నిర్వహిస్తు న్నాం. సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంటి ఆవరణలో ఉండే పూలతొట్టీలు, డ్రమ్ముల్లోని నీటిని తొలగిస్తున్నాం. మురికి కుంటల్లో ఆయిల్బాల్స్ వేయిస్తున్నాం.
– డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా మలేరియా అధికారి