శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 25, 2021 , 00:03:28

30 ఏండ్ల కల సాకారం

30 ఏండ్ల కల సాకారం

చిట్టెపురెడ్డిలను బీసీలో చేర్చడం సంతోషకరం

సీఎం కేసీఆర్‌ చొరవతో సాధించుకున్న విజయం

ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

స్వరాష్ట్రంలోనే చిట్టెపురెడ్డిల కోరిక నెరవేరింది

జుక్కల్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్సీ కవిత 

పిట్లంలో చిట్టెపురెడ్డిల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం 

పిట్లం, నిజాంసాగర్‌, జనవరి 24: సీఎం కేసీఆర్‌తోనే చిట్టెపు రెడ్డిలను బీసీ‘డీ’లో చేర్చాలనే 30 ఏండ్ల కల సాకారమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఆదివారం నిర్వహించిన కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపురెడ్డిల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిట్టెపురెడ్డిలను బీసీల్లోకి మార్చాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారని, దీంతో కేశవరావు ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేసి బీసీ‘డీ’లోకి మారుస్తూ సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నాడు మూడు బీసీ కమిషన్లను ఏర్పాటు చేసినా తగిన న్యాయం జరుగలేదని, స్వరాష్ట్రంలోనే అన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరి పంట సాగులో పంజాబ్‌ కన్నా దీటుగా రాష్ట్రం ఉన్నదని, కల్యాణలక్ష్మి, షీ టీమ్‌ల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భరోసా కల్పిస్తున్నదని చెప్పారు. రైతుబంధు పథకాన్ని చూసి ప్రధాని మోదీ పేరు మార్చి మరో పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. నాగమడుగు మత్తడితో జుక్కల్‌ నియోజకవర్గం సస్యశ్యామలం కానుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన పనులను విడుతల వారీగా నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. చిట్టెపురెడ్డిలందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మాట్లాడుతూ.. చిట్టెపురెడ్డిల ఆత్మీయ సమ్మేళనంతోనే నేడు పిట్లంకు ఎమ్మెల్సీ కవిత వచ్చారని వారికి ధన్యవాదాలు తెలిపారు. పిట్లంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణం కోసం, పిట్లం  బాన్సువాడ డబుల్‌ రోడ్డు పూర్తిచేసేందుకు నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్సీ కవితను ఆయన కోరారు. ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చిట్టెపురెడ్డిలను బీసీ‘డీ’లోకి మార్చి ఆదుకున్నారని, వారికి ప్రభుత్వం తరఫున అందాల్సిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. చిట్టెపురెడ్డిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివసాయి పటేల్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సమావేశంలో కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, చిట్టెపు రెడ్డిల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాప్రసాద్‌, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు గంగాధర్‌రెడ్డి, రాంచందర్‌ పటేల్‌, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, పిట్లం ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ విజయలక్ష్మి, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల చిట్టెపురెడ్డిల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo