బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nizamabad - Aug 10, 2020 , 01:37:03

సాంస్కృతిక సారథులు చైతన్యానికి వారధులు

సాంస్కృతిక సారథులు చైతన్యానికి వారధులు

కళాకారుల పురిటిగడ్డ.. లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామం. ఏడు వందలకు పైగా కుటుంబాలు గ్రామంలో ఉండగా, వందమందికిపైగా కళాకారులు ఉన్నారు. చైతన్యానికి మారుపేరైన భవానీపేటలో ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రత్యేకమే.

ఒకప్పుడు భవానీపేట గ్రామం పేరు చెబితేనే భయపడేవారు. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న గ్రామం ప్రస్తుతం కళాకారుల పుట్టినిల్లుగా మారింది. గ్రామానికి చెందిన కళాకారులు జానపదాలు, పల్లె సుద్దులు, భజన కార్యక్రమాలు, వీధి నాటకాలు, కోలాటం తదితర కళల్లో రాణిస్తున్నారు. సామాజిక అంశాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు కృషిచేస్తున్న కళాకారుల ఉత్సాహాన్ని గమనించిన ఉపాధ్యాయులు శ్రీహరి, లక్ష్మీనారాయణ వారికి కళలపై మరింత అవగాహన కల్పించారు. పాఠశాలలో నాటికల ప్రదర్శన ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. పాఠశాలతోపాటు గ్రామంలో వీధి నాటకాలు ప్రదర్శించడం, సామాజిక చైతన్యాన్ని పెంచే పాటలు పాడడం, భజన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. పూర్తిస్థాయిలో పట్టు సాధించిన కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శనలు ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన అక్షర కిరణం, ఎయిడ్స్‌ నివారణ, శిశుసంక్షేమం, బాల్య వివాహాల నిర్మూలన, వైద్యం, ఇందిరాక్రాంతి పథం, వరకట్న దురాచారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పంటల మార్పిడి విధానం, పంటల సాగుకు ముందు భూసార పరీక్షల ఆవశ్యకత, భూగర్భజలాల పెంపు తదితర అంశాలపై తమ ప్రదర్శనల ద్వారా ప్రజలు, రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. 

స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం కొనసాగుతున్న కాలంలో ‘ధూంధాం’తో హోరెత్తించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు ప్రదర్శనలూ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, రైతుబంధు తదితర పథకాలపై కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఐదేండ్ల క్రితం జాతీయస్థాయిలో సంస్కారభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో నాలుగో స్థానంలో నిలిచారు. సమాచార శాఖ అధికారులు జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.  

తాజావార్తలు


logo