బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jun 20, 2020 , 02:18:04

‘తెలంగాణ సోనా’కు డిమాండ్‌

‘తెలంగాణ సోనా’కు డిమాండ్‌

lఏడు రాష్ర్టాల్లో ఆదరణ

lఇతర వరి రకాల కన్నా తక్కువ గ్లూకోజ్‌

lటైప్‌-2 షుగర్‌ను తగ్గిస్తుందని తేల్చిన ఎన్‌ఐఎన్‌, ఐసీఎంఆర్‌

నిజామాబాద్‌ అర్బన్‌ / ఎల్లారెడ్డి రూరల్‌ : రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతులకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌-15048) వరి రకానికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఈ వరి రకంలో గ్లూకోజ్‌ శాతం తక్కువగా ఉంటుంది. టైప్‌-2 డయాబెటిస్‌ నియంత్రణలో ఈ వంగడం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని పరిశోధనలో తేలింది. తెలంగాణ సోనాలో గ్లూకోజ్‌ శాతం 51.6 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాల్లో ఉండే స్థాయిలోనే కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. 

ఈ వంగడం రెండు పంటలకు అనుకూలం

యాసంగి, వానకాలం రెండు పంటలు పండించుకునే సౌకర్యం తెలంగాణ సోనాకు ఉన్న ప్రత్యేకత. సాంబా మసూరి (బీపీటీ-5204) 155 నుంచి 160 రోజుల సమయం పడితే దీన్ని పండించడానికి 125 రోజులు పడుతుంది. దిగుబడి కూడా 5 నుంచి 10 శాతం ఎక్కువగానే ఉంటుంది. సాంబా మసూరి ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తే తెలంగాణ సోనా రకంతో 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ నిపుణుల అంచనా. సాంబా మసూరి కన్నా ప్రొటీన్‌ 8.76 శాతం ఎక్కువగా ఉండడంతో పాటు బీ2, బీ3 విటమిన్‌లు కూడా ఉంటాయి. బియ్యాన్ని తింటే గ్లూకోజ్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేస్తుందని గుర్తించారు. తెలంగాణ సోనా వరి రకానికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ డిమాండ్‌ ఉంది. దీనికున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సోనా లాభదాయక పంటగా వ్యవసాయ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు.  

పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • lవానకాలంలో తప్పనిసరిగా జూలైలో మాత్రమే నారు పోసుకోవాలి. జూన్‌ లో నారు పోసుకుంటే కాలపరిమితి పెరుగుతుంది. యాసంగిలో నవంబర్‌ 15వ తేదీ నుంచి డిసెంబర్‌ మొదటి వారం లోపు నారు పోసుకోవాలి. ఈ రకాన్ని చౌడు నేలల్లో సాగు చేయరాదు.
  • lవానకాలంలో కొంచెం ఎత్తు పెరుగుతుంది. కనుక నత్రజని ఎరువును మోతాదు (సుమారు 25 శాతం) తగ్గించి వేసుకోవాలి. యాసంగిలో సిఫారసు చేసిన నత్రజని 35 కిలోల యూరియాను దుక్కిలో, ఎక్కువ భా గాన్ని (45కిలోల యూరియా) నా టిన 15-20 రోజులకు, మిగతా 25 కిలోల యూరియాను చివరి దఫాగా అంకుర దశలో వేస్తే పిలకలు బాగా వచ్చి మంచి దిగుబడి వస్తుంది.
  • lఈ రకం చదరపు మీటర్‌కు 44 కుదుళ్లు ఉండేలా నాటుకోవాలి.
  • lఈ రకంలో కాండం తొలుచు పురుగు (మొగి పురుగు) ఆశించే అవ కాశం ఉంటుంది. నాటిన 7 నుంచి 10 రోజుల్లో గుళికలు, చిరు పొట్ట దశలో కార్టప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్‌ వంటి మందులు (గుళికలు లేదా పిచికారీ మందును సిఫారసు చేసిన మోతాదులో) వాడి నివారించుకోవాలి.


logo