సోమవారం 25 మే 2020
Nizamabad - May 23, 2020 , 02:16:52

సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మాణం

సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మాణం

 సీఎం సమక్షంలో ముందుకు వచ్చిన  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

 తండ్రిబాటలో రైతాంగ సంక్షేమానికి కృషి

 మంత్రిని అభినందించిన సీఎం కేసీఆర్‌

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: నియంత్రిత సాగు విధానంపై గురువారం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని ప్రకటించారు. సీఎం నిర్ణయం స్ఫూర్తిగా మంత్రి వేముల స్పందించి తాను కూడా తన స్వగ్రామమైన వేల్పూర్‌లో తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం రైతువేదికను తన సొంత ఖర్చులతో నిర్మిస్తానని సీఎంకు తెలిపారు. తన తండ్రి సురేందర్‌రెడ్డి రైతు సంక్షేమం, రైతు బాగు కోసం పరితపించే వారని, ఆయన పేరున రైతుల కోసం వేదిక నిర్మించి అందజేస్తానని తెలిపారు. దీంతో మంత్రి వేములను సీఎం అభినందించారు.

తండ్రిబాటలో..

రైతుబంధుగా పేరు పొందిన దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డికి రైతులన్నా, రైతుకు ఉపయోగపడే పనులన్నా ఎంతో ఇష్టం. తన సుదీర్ఘ రాజకీయ జీవితమంతా రైతు నేపథ్యాన్నే అల్లుకుంటూ ముందుకు సాగారు . ఇప్పుడు సురేందర్‌రెడ్డి కొడుకు, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన తండ్రి లాగే రైతు కార్యక్రమాలంటే ఎంతో ఇష్టంతో, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలంటే ఎంతో బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతు నేపథ్యాన్ని తన తండ్రి నుంచి పుణికి పుచ్చుకొని, తండ్రి సురేందర్‌రెడ్డి లాగానే తనయుడు రైతుల మనసుల్లో నిలుస్తున్నాడు.రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే భారీ కార్యక్రమాలు చేపట్టిన మంత్రి వేముల.. తాజాగా సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిగా, తన తండ్రి సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం రైతుల కోసం తన సొంత గ్రామం వేల్పూర్‌లో రూ.15 లక్షలతో రైతువేదిక భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

సీఎం స్ఫూర్తితో...

రాష్ట్రంలో రైతుబంధు సమితి ఏర్పాటు తర్వాత  క్లస్టర్ల వారీగా రైతుల సమావేశాల కోసం, వారికి సమాచార కేంద్రాలుగా,  వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం రైతువేదికల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. నిజామాబాద్‌ జిల్లాలో 106 రైతు వేదికల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 90 రైతు వేదికలకు స్థల సేకరణ పూర్తయ్యింది. ఒక్కో రైతు వేదికను రెండు వేల చదరపు అడుగుల్లో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. వీటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నది.

రైతుల హర్షం...

మంత్రి వేముల నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కోసం వేముల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. సీఎం సహకారంతో జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించారు. బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో లక్షా 18 వేల ఎకరాలకు సాగు నీటిని అందిచే ప్యాకేజీ-21 పథకాన్ని పూర్తి చేయిస్తున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ నీటిని అందించే హన్మంత్‌ రెడ్డి, నవాబు, బోదెపల్లి తదితర ఎత్తిపోతలకు ఎస్సారెస్పీలో డెడ్‌ స్టోరేజీ నుంచి సైతం నీరందించే లక్ష్మి ఎత్తిపోతలను పూర్తి చేయించారు. లక్ష్మి కాలువ ఆధునీకీకరణకు కృషిచేశారు. నవాబు, నిజాంసాగర్‌ కాలువలను ఆధునీకరించి, హన్మంత్‌ రెడ్డి ఎత్తిపోతల లీకేజీలను అరికట్టి రైతుల చింత తీర్చారు. గట్టు పొడిచిన వాగు, వేముగంటి ప్రాజెక్టులను పూర్తి చేయించి భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, మండలాల రైతుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. గుమ్మిర్యాల్‌, జలాల్‌పూర్‌, నాగేపూర్‌ ఎత్తిపోతలను తెచ్చారు. పెద్దవాగు, కప్పల వాగుల్లో భారీ చెక్‌డ్యాంలు నిర్మించి రైతులకు ప్రయోజనం చేకూర్చారు.


logo