కోటగిరి ఆగస్టు 7:గతంలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఉండేది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా ఆకస్మికంగా రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా అన్నదాత మరణిస్తే పది రోజుల్లోపు బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటివరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని కొత్తపట్టాదారు రైతులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీలోపు భూములను రిజిస్టర్ చేసుకున్న రైతులు, 11వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.
అర్హతలు, దరఖాస్తు ఇలా..
రైతు వయస్సు 18 నుంచి 59 ఏండ్లలోపు ఉండాలి.సంబంధిత ఫారాలు నింపి, రైతు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, పహాణీతోపాటు నామినీకి చెందిన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తును అధికారులు పరిశీలించి బీమా కోసం సిఫారసు చేస్తారు.
రైతులు వినియోగించుకోవాలి..
గతంలో బీమా పొందని రైతులు ఈ నెల 11 వరకు పట్టాదారు పాస్‌బుక్‌తో వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతపరిచి కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత గ్రామ ఏఈవోలకు కూడా బీమా దరఖాస్తు ఇవ్వొచ్చు.