కామారెడ్డి, జూన్ 2 : ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో మూడు పరీక్షాకేంద్రాలను (బాన్సువాడలో -2, కామారెడ్డిలో -1) ఏర్పాటు చేసినట్లు డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం 695 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నారు. పాఠశాల నుంచి హాల్టికెట్లు పొందలేని విద్యార్థులు www.bse.telangana.gov.in అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూం నంబర్ 9032695219 లో సంప్రదించాలని సూచించారు.