కోటగిరి/ఖలీల్వాడి/ఆర్మూర్/జక్రాన్పల్లి/మోర్తాడ్, అక్టోబర్ 12: కోటగిరి మండలం పొతంగల్, దోమలెడ్గి, వల్లభాపూర్ గ్రామాల్లో మంగళవారం సద్దుల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, చిన్నారులు ఆడిపాడారు. యువతులు దాండియా ఆడి సందడి చేశారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. పాత పొతంగల్లో బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలకు వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్ బహుమతులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది పేద మహిళలకు సంస్థ తరఫున చీరలను పంపిణీ చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. డీఆర్వో కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. నగర మేయర్ నీతూకిరణ్, మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ గాయత్రీ జూనియర్ కళాశాల, సాయి వొకేషనల్ జూనియర్ కళాశాలల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. దయానంద్నగర్ కాలనీలో యువ యూత్ దుర్గామాత మండపం వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఏరియా ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యులు అమృత్ రాంరెడ్డి, శ్రీనివాసులు బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. జక్రాన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపికచేసి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఎంపీపీ డీకొండ హరిత, సర్పంచ్ గంగు, నాయకులు పాల్గొన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ ఆడారు. సంబురాల్లో సర్పంచ్ ధరణి, అధ్యాపకులు పాల్గొన్నారు.