ఎల్లారెడ్డి, జనవరి 12: ఉమ్మడి జిల్లా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు రిజర్వేషన్ల మార్పుపై ఆందోళన చెందుతున్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉండడంతో తమకు కలిసి వస్తుందో లేదోనని ఉత్కంఠకు గురవుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు సోమవారం తుది ఓటరు జాబితాను ప్రకటించగా, ఇక రిజర్వేషన్ల ఖరారు మాత్రమే మిగిలి ఉన్నది.
వారం రోజుల క్రితం ఓటరు జాబితా డ్రాఫ్ట్‌ను విడుదల చేసిన అధికారులు, సోమవారం ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురించారు. మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్ల వివరాలు, బూత్‌లను నేడు (మంగళవారం) ప్రకటించునున్నారు. ఓటర్లు, వార్డులు, పురుష, మహిళా ఓటర్ల వివరాలను ప్రకటించిన అధికారులు ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించిన వివరాల సేకరణలో నిమగ్నమైనట్లు సమాచారం. ఉన్నతాధికారులు సమాచారం అడిగిన వెంటనే ఇవ్వడానికి వారు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన సమగ్ర సమాచారం తీసుకున్న రాష్ట్ర స్థాయి అధికారులు రాజధానిలోనే వాటిని ఖరారు చేయనున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లు, జనాభా లెక్కల సమాచారాన్ని క్రోడీకరించి నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లను ప్రకటిస్తారని తెలుస్తున్నది.
ప్రతి మున్సిపల్లో వార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు తీసుకున్నారు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఆయా మున్సిపాలిటీల్లో గత పాలక వర్గంలో ఉన్న రిజర్వేషన్లు, ఇప్పుడు ఉన్న ఓటర్ల వివరాల ఆధారంగా ఖరారు చేసే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఆయా వార్డుల్లో పెరిగిన ఓటర్ల సంఖ్య, పెరిగిన కులాల వారీగా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఇప్పటి రిజర్వేషన్లు ఉండడమా, మారడమా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరుగుతుంది. దీని ఆధారంగా అక్కడ వార్డుల రిజర్వేషన్లు పూర్తిగా మారే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వారీగా ఓటర్ల వివరాలను సేకరించడంలో అధికారులు బిజీగా ఉన్నారు. సోమవారం ఓటరు తుది జాబితా విడుదల చేయడంతో, రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 16 తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.