శక్కర్‌నగర్, డిసెంబర్ 15: బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ పటేల్ అనే యువకుడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రత్యేక పోలీసు బృందం సభ్యుడు, సీసీఎస్ ఏసీపీ జి.రమేశ్ అన్నారు. బోధన్ పట్టణ శివారులో శ్రీకాంత్ మృతదేహం లభ్యమైన స్థలాన్ని గురువారం ఆయనతోపాటు పలువురు పోలీసు అధికారులు పరిశీలించారు. సెప్టెంబర్ 22న అదృశ్యమైన శ్రీకాంత్ మృతదేహం లభ్యంకాగా తహసీల్దార్ వరప్రసాద్ పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం చేయించామని అన్నారు. శ్రీకాంత్‌ను అక్కడే చంపివేశారా, లేదా చంపి ఉరి వేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా, వైద్యుల సలహాలు, పరీక్షల అనంతరం శవంపై ఏవైనా గాయాలున్నాయా అనే విషయాలు బయటికి వచ్చే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. సీపీ ఆదేశాల మేరకు కేసును త్వరగా చేదిస్తామని అన్నారు. వైద్యుల నివేదికలతోపాటు మృతుడి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తామన్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని సీసీఎస్ ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన వెంట ఏసీపీ రాజశేఖర్, పట్టణ సీఐ బీడీ. ప్రేమ్‌కుమార్, పోలీసులు ఉన్నారు.
సెల్‌ఫోన్‌తో మరిన్ని ఆధారాలు..
కుళ్లిన శ్రీకాంత్ మృతదేహం వద్ద లభ్యమైన సెల్‌ఫోన్ ఆధారంగా మరిన్ని వివరాలు పోలీసులకు లభ్యమయ్యాయి. సదరు యువకుడు యువతితో అక్టోబర్ 10వ తేదీ వరకు టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈకేసులో బోధన్ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసు పురోగతికి గాను సీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.