కామారెడ్డి/కంఠేశ్వర్, డిసెంబర్ 27: డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు వినూత్నంగా నిరసన చేపడుతున్నారు. రోజుకో రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు బుధవారం భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. అలాగే నిజామాబాద్లో బసవన్నకు వినతిపత్రం సమర్పించి ప్రభుత్వం తమ మొర ఆలకించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏండ్లుగా పని చేస్తున్నా తమకు కనీస వేతనాలు లేవని వాపోయారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమ్మెతో కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో విద్యాబోధన నిలిచిపోయిందని, అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నట్లు రాష్ట్రంలో ఉన్నది ప్రజా పాలన అయితే తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులను రోడ్డు పైకి తీసుకొచ్చిన ప్రభుత్వ మొండి వైఖరి మారాలని, అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామన్న మాటను రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు ఇకనైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.