ఆర్మూర్, ఆగస్టు 8 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇదివరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మండలాన్ని ఒక యూనిట్‌గా తీ సుకుని మండల కేంద్రాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రా ల్లో, మెజార్టీ గ్రామపంచాయతీల ఆవరణల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదే విధంగా బృహత్ పట్టణ ప్రకృతి వనాల ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో సాధ్యమైనంత త్వరలో బృహత్ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలని సీఎం సూచించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో బృహత్ పట్టణ ప్రకృతివనాలను ఏర్పాటు చేయడంలో అధికారులు తలమునకలయ్యారు.
జిల్లాలో ఆరు బృహత్ పట్టణ ప్రకృతి వనాలు
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ నగరంలో మొత్తం ఆరు బృహత్ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 2, బోధన్‌లో 2, భీమ్‌గల్, నిజామాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున పార్కులను ఏర్పాటు చే సేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికే స్థలాలను గుర్తించారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 5 ఎకరాల స్థలంలో, ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామమైన పెర్కిట్‌లో ఉన్న దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణం ఆవరణలో ఒక ఎకరం స్థలంలో, బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ ఏరియాలో 10 ఎకరాల్లో, బోధన్ విలీన గ్రామంలో ఆచన్‌పల్లి పంచాయతీ పక్కన 10 ఎకరా ల్లో, భీమ్‌గల్ పట్టణ శివారులోని కుప్కల్లో 10 ఎకరా ల స్థలంలో, నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో బృ వనాలను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు గుర్తించిన స్థలాల్లో ఇప్పటికే పనులను ప్రారంభించారు.
ఆహ్లాదం పంచే విధంగా..
బృహత్ పట్టణ ప్రకృతివనాల ఏర్పాటుతో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందనున్నది. పార్కుల్లో ప్రజలు సేద తీరేందుకు కుర్చీలు, వాకింగ్ ట్రాక్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు.
స్థలాలను గుర్తించాం
ఆర్మూర్ మున్సిపాలిటీల్లో రెండు బృహత్ పట్టణ ప్రకృతివనాల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తిం చాం. త్వరలోనే ఆ స్థలాల్లో పరిశుభ్రం చేయించి మొక్కలు నాటి బృహత్ పట్టణ ప్రకృతివనాలను తీర్చిదిద్దుతాం.
ఆహ్లాదకరమైన వాతావరణం..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం బృహత్ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నాం. ఇదివరకు ఆర్మూర్‌లోని కోటార్మూర్ గుట్ట వద్ద నిర్మించిన పట్టణ ప్రకృతి వనాన్ని తలదన్నే రీతిలో బృహత్ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తాం.
-పండిత్ వినిత పవన్, మున్సిపల్ చైర్పర్సన్, ఆర్మూర్
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన బృహత్ పట్టణ ప్రకృతి వనాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆర్మూర్‌లో రెండు బృహత్ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నాం.
-ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి