నిజామాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తె లంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏటా శనగలు, కందులు కొనుగోళ్లలో భారీగా గోల్మాల్ జరుగుతుంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతులకు బాసటగా నిలిచి పంటలను సేకరిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరను కర్షకులకు అందించేందుకు సర్కారు రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర సర్కారు ఉద్దేశాన్ని వక్రమార్గం పట్టించేందుకు ప్రతి సీజన్లోనూ పంటల కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులతో వ్యవసాయాధికారులు, మార్క్ఫెడ్, పౌరసరఫరాల శాఖలు కుమ్మక్కు అవుతుండడంతో ఇష్టారాజ్యం పెరుగుతున్నది. ప్రైవేటు వ్యక్తుల ప్రమేయానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు, రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయ శాఖ గత కొన్ని సంవత్సరాలుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలో రైతులు సాగు చేస్తున్న పంటల పూర్తి సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా కొనుగోళ్ల సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి దళారులు తెచ్చిన పంట కొనుగోలు చేసే అవకాశం ఉండబోదు. ఇలా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ చేపడుతున్న వ్యవసాయ సాగు సర్వే ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. 210 క్లస్టర్లలో ఏఈవోలు ఇదే పనిలో బిజీగా ఉన్నారు.
కొనుగోళ్లు పక్కాగా..
పంటల సాగు వివరాలను ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది. రైతులు పండిస్తున్న పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడంతో దళారుల పాత్ర తగ్గడంతో పాటు ప్రైవేటులో తక్కువకు పంటలు కొనుగోలు చేసిన వ్యాపారులు తిరిగి సర్కారుకు పంటను అమ్ముకునే అవకాశం ఉండదు. గతంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయాధికారుల ప్రోత్సాహంతో దొంగ పత్రాలను పొంది ప్రభుత్వ మద్దతు ధరను కొల్లగొడుతున్న ఘటనలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకునేవి. ఈ ఘటనలు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సాగే కందులు, పెసర్లు, మినుములు, శనగల కొనుగోళ్లలో వెలుగు చూస్తున్నాయి. బయటి రాష్ర్టాల్లో తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి దొడ్డి దారిన అధిక ధరలకు విక్రయించి గంటల్లోనే దళారులు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. తద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న పంటల దిగుబడి కన్నా ఎక్కువగా కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి ఏటా ఎదురవుతున్నది. ఒకానొక దశలో బయటి వ్యక్తు ల ప్రమేయంతో అసలైన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి దోపిడీ వ్యవస్థను ఖతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు వివరాల నమోదుకు శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లాలో 210 క్లస్టర్లు…
రైతుబంధు పోర్టల్లోని రైతుల వివరాలను ఆధారంగా చేసుకుని ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. రైతులు పంటలు వేసిన సమయానికి అనుగుణంగా ఆ వివరాలను నమోదు చేస్తారు. పొలం గట్ల వెంట, హద్దుల వెంబడి రైతులు నాటే వివిధ రకాల మొక్కల వివరాలను సైతం ఏఈవోలు సేకరిస్తారు. విత్తనోత్పత్తి కోసం పంటల సాగు, సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగు, సాగు నీటి వసతి వివరాలు, నీటి పారుదల, బిందు సేద్యం పద్ధతుల వివరాలను సేకరించనున్నారు. నమోదైన పంటల సాగు వివరాలను సంబంధిత రైతు మొబైల్ ఫోన్కు మెస్సేజ్ సైతం పంపించేలా ఏర్పాటు ఉంటుంది. రైతు వారీగా పంటల సాగు వివరాలను గతంలోనూ ఇదే తరహా ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వానకాలంలో రైతులు సాగు చేసే ప్రతి పంటను ఇందులో నమోదు చేస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని రైతులు పండించిన వివిధ పంటల కొనుగోళ్లలో లబ్ధిదారులను గుర్తించేందుకు దోహదం చేయనున్నది. ఏఈవోలు గ్రామాలకు వచ్చి రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతుబంధు సమితికి సమాచారం ఇచ్చి వారి సహకారంతో వివరాలను సేకరిస్తారు. వ్యవసాయ శాఖలో నిజామాబాద్ జిల్లాలో 106 క్లస్టర్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లలో ఏఈవోలు పని చేస్తున్నారు.
ఈ సీజన్లో భారీగా పంటల సాగు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో 2021 వానకాలంలో ఏకంగా 10లక్షల ఎకరాలకు పైగానే పంటలు సాగవుతున్నా యి. నిజామాబాద్ జిల్లాలో 2020 వానకాలంలో 4లక్షల 92వేల 152 ఎకరాల్లోనే పంటలు సాగవ్వగా ఈసారి 5లక్షల 7వేల 800 ఎకరాల్లో పంటలు వేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2020 వానకాలంలో 4లక్షల 50వేల 578 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సారి 4లక్షల 98వేల 193 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగడం విశేషం. ఉభయ జిల్లాల్లో వ్యవసాధికారులు చేపడుతున్న సర్వేలో రైతుల పంటల వివరాలు నమోదు కాకుంటే మార్కెట్లో పంట విక్రయానికి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు లెక్క పక్కాగా తేలనుంది. రైతుల వారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణంతో పాటు వేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంటలు, నీటి వసతి, మొబైల్ నంబర్ చివరలో రైతు సంతకం తీసుకుంటున్నారు. పంట సాగు చేసే ప్రతి రైతు తమ వివరాలను నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకునే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా ముగింపునకు చేరింది.