మాక్లూర్, డిసెంబర్ 6: యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుందన్న ధీమాతో పంటలు వేయడంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో నాసిరకం బెడద ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే పంట నష్టపోయే ప్రమాదం ఉందని మాక్లూర్ మండల వ్యవసాయాధికారిణి పద్మ సూచిస్తున్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. సరిగ్గా సీల్ చేసిన ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాల బస్తాలనే ఎంపిక చేయాలి. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాలను కొనుగోలు చేయకూడదు. గడువు దాటిన విత్తనాల జోలికి పోకూడదు. బస్తాపై విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ వంటి విషయాలు గమనించి కొనుగోలు చేయాలి. బిల్లుపైన డీలర్ల సంతకం తీసుకోవాలి. బిల్లు పై విక్రయదారుడి సంతకం, రైతుపేరు, గ్రామం, విక్రయదారుడి సంతకం, తేదీలు, నికర తూకం, గడువు తేదీ, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. హైబ్రిడ్ విత్తనాలు కొనేటప్పుడు రకం, స్వచ్ఛత, మొలక శాతం, పరిగణలోకి తీసుకోవాలి, మొలకెత్తె దశలో, పూత దశలో లోపాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. అరువు పద్ధతిలో కొనుగోలు చేసినా బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. వాటి బిల్లులు, ఖాళీ సంచులు, పంటకాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలి. మిషన్కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే వాడాలి. చేతికుట్టు ఉంటే సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ఉత్పత్తి చేసిన సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి. కొనుగోలు సమయంలో డీలర్ రసీదులో రైతు తప్పనిసరిగా సంతకం చేయాలి. చిల్లుపడిన, చిరిగిన బస్తాలోని ఎరువులను కొనరాదు. గడ్డకట్టిన ఎరువుల్లో నాణ్యత లోపిస్తుంది. వాటిని కొనుగోలు చేయొద్దు. గుళికల పరిమాణ ఆకారంలో తేడా ఉంటే నాసిరకం ఎరువుగా గుర్తించాలి.
వ్యవసాయ, ఉద్యానవనశాఖ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రిమిసంహారక మందులను కొనుగోలు చేయాలి. నిల్వ ఉన్న మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. డబ్బాపై వజ్రాకారంలో పురుగుమందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం, స్వల్ప విష పూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. మందు పేరు, రూపం, శాతం, పరిమాణం, జాగ్రత్తలు, విరుగుడు, తయారు చేసిన సంస్థ పేరు, గడువు తేదీ వివరాలను పరిశీలించాలి. లేబుల్ లేని సీసాలు, డబ్బాలు, ప్యాకెట్లు, కొనుగోలు చేయొద్దు. పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలను ధ్వంసం చేసి గుంతల్లో పెట్టాలి.
పంట వేసే ముందు జాగ్రత్తలు పాటించడంతోపాటు, కొనుగోలు చేసిన విత్తనాలను తప్పనిసరిగా శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించవచ్చు. మొలక శాతం పెరుగుతుంది. విత్తన శుద్ధిద్వారా మొక్కకు రక్షణ, జన్యు శుభ్రత పెరుగుతుంది. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకోవచ్చు. డ్యామెజ్ సీడ్ బయటికి వెళ్లిపోయి, నాణ్యమైన విత్తనాలు మిగులుతాయి. రెండు పంటల అవశేషాలకు సంబంధించి తెగుళ్ల రక్షణ ఉంటుంది.
– పద్మ, మండల వ్యవసాయాధికారిణి, మాక్లూర్