నిజామాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజుల పాటు దంచి కొట్టిన వాన.. తెరిపివ్వకుండా ఏకధాటిగా కురిసిన వర్షం.. రోజుల కొద్దీ ఊరు, ఏరు ఏకమై ప్రవహించిన వరద… వందలాది ఇండ్లను చుట్టుముట్టిన నీళ్లు.. తెగిన తటాకాలు.. ధ్వంసమైన రోడ్లు.. ఎక్కడికక్కడ నిలిచిన రవాణా.. గల్లీ రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకు వరద ప్రభావంతో విలవిల.. ఖాళీ ప్రదేశాలన్నీ చెరువులను తలపించిన వైనం.. పట్టణాలు, నగరాలు తేడా లేకుండా ముంపునకు గురైన అనేక ప్రాంతాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మూడు దశబ్దాల క్రితం నాటి రికార్డు స్థాయి వర్షాలతో నిజా మాబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే రీతిలో వర్షం కురిసినప్పటికి పెను ప్రభావానికి మాత్రం గురి కాలేదు. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పలు మండలాల్లో 20 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జడి వానతో జన జీవనం స్తంభించగా పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖలకు చెందిన ఉద్యోగులు మాత్రం అహోరాత్రులు కష్టపడి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్లుగా అప్రమత్తమై చర్యలు చేపట్టడం ద్వారా ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆస్తి, ప్రాణ నష్టాలు భారీగా జరుగకుండా నిలువరించారు. కాకపోతే ఈ వర్షాల మూలంగా ఉమ్మడి జిల్లాలో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలవడం దురదృష్టంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. వరద ఉధృతికి పలు చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. రహదారులపై నుంచి వరద కొనసాగుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కామారెడ్డి జిల్లాలో 6,771 ఎకరాల్లో నీట మునిగిన పంటలు కామారెడ్డి జిల్లాలోని 99 గ్రామాల పరిధిలో 6,771 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి 2,908 ఎకరాలు, మక్కజొన్న 1,583, సోయాబీన్ 1,944, పత్తి 149, పెసర 60, మినుము 40, కంది 87 ఎకరాల్లో నీట మునిగినట్లు జిల్లా వ్యవసాయ శాఖ గుర్తించింది.
102 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
కామారెడ్డి జిల్లాలో వర్షాల కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. పంచాయతీ రాజ్‌కు సంబంధించి 57 కిలోమీటర్ల రోడ్లు వర్షానికి దెబ్బతిన్నట్లు పంచాయతీ రాజ్ శాఖ గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 23 రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆర్అండ్బీ శాఖకు సంబంధించి 45 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. నాలుగు కల్వర్టులకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. బాన్సువాడ డివిజన్లోని బిచ్కుంద, పిట్లం, పెద్ద కొడప్గల్, మద్నూర్, జుక్కల్ మండలాల్లోని పది చోట్ల వాగులు, వంకలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.

నేలకొరిగిన 46 స్తంభాలు..
వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 46 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఎల్టీ పోల్స్, డీటీఆర్ పోల్స్ పడిపోయిన స్థానంలో కొత్తవాటిని సమకూరుస్తున్నారు.
480 ఇండ్లు పాక్షికంగా.. 21 పూర్తిగా ధ్వంసం
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 480 ఇండ్లు పాక్షికంగా, 21 పూర్తిగా ధ్వంసమయ్యాయి. గురువారం ఒక్క రోజే 176 పాక్షికంగా, 9 ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో వర్షపాతం వివరాలు
ఉమ్మడి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారం 51.5 మి.మీ వర్షపాతం నమోదైంది.నిజామాబాద్ జిల్లాలో 124.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
వరదలో కొట్టుకుపోతున్న నలుగురిని కాపాడిన మత్స్యకారులు
ఆర్మూర్, జూలై 14 : వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న ఓ కుటుంబాన్ని మత్స్యకారులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఆలూర్ గ్రామం వైపు వెళ్లే రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆర్మూర్‌కు చెందిన దంపతులు వారి మనుమడు, మనవరాలితో కలిసి గురువారం బైక్‌పై వెళ్తుండగా వరద ఉధృతి ఎక్కువ కావడంతో కిందపడిపోయారు. వాగులోకి కొట్టుకుపోతున్న వారిని గమనించిన మత్స్యకారులు వారిని బయటకు తీసి కాపాడారు.

జలదిగ్బంధంలో జాతీయ రహదారి
ఆర్మూర్, జూలై 14 : ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెనుక గల దోబీఘాట్ పక్కన గల 63వ నంబర్ జాతీయ రహదారిపై గూండ్ల చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు భారీగా నీరు ప్రవహించడంతో రహదారి కోతకు గురైంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు వాహనాలను పాతరోడ్డు గుండా మళ్లించారు. అదేవిధంగా ఆర్మూర్ నుంచి ఆలూర్ గుండా నందిపేట్ వెళ్లే రోడ్డు సైతం జలమయం కావడంతో ప్రయాణికులు వెళ్లకుండా మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు రోడ్డుపై బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. మండలంలోని మంథని, పిప్రి గ్రామాల మధ్య గల రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడంతో 12 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.

నిజామాబాద్ జిల్లాలో 49 వేల ఎకరాల్లో పంట నష్టం
నిజామాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 25, 869 మంది రైతులకు చెందిన 49, 591 ఎకరాల పంట నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. సోయా, పత్తి, వరి పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. వ్యవసాయ భూముల్లో వరద నిలిచి ఉండడంతో పంట నష్టం వివరాల గణన ఇంకా కొనసాగుతున్నది.