కోటగిరి, ఆగస్టు 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ఫలాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిషన్‌కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించిన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ కృషి , మరోవైపు వానలు విస్తారంగా కురవడంతో సాగునీటికి ఢోకా లేదని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తిర్మలాపూర్, లింగాపూర్, హెగ్డోలి, దోమలెడ్గి, కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు, నల్ల చెరువు, యాద్గార్పూర్. వల్లభాపూర్, ఎత్తొండ, కొల్లూర్, హెగ్డోలి, పొతంగల్, కొడిచెర్ల, ఎక్లాస్పూర్ చెరువు పూర్తిస్థాయిలో నిండాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండి అలుగుపారాయి.
నిండుకుండల్లా చెరువులు
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో మండలంలోని చెరువులు నిండుకుండల్లా మారాయి. యాద్గార్పూర్, దోమలెడ్గి, తిర్మలాపూర్, హెగ్డోలి, కోటగిరిలోని నల్ల చెరువు, దామరచెరువు నీటితో కళకళలాడుతున్నాయి. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో వాననీరు పంటలకు ఉపయోపడుతున్నదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు వానలు సమృద్ధిగా కురిశాయని, మిషన్ కాకతీయ ఎంతో మేలు చేసిందని అంటున్నారు.