గజిబిజి జీవితంతో ప్రజలు నిత్యం సతమతమవుతూ గజినీలుగా మారుతున్నారు. ఈ కారణంగా మెదడు ఆలోచనల వలయంలో చిక్కుకుంటుంది. ఏకాగ్రత కోల్పోతూ….క్షణాల వ్యవధిలోనే పాత విషయాలను మరిచిపోయే స్థితికి చేరుకుంటున్నారు. మెదడు ‘స్మార్ట్‌గా’ పట్టుతప్పుతున్నది. మనిషి దైనందిన జీవితంపై స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపుతున్నది. ఆండ్రాయిడ్ ఫోన్‌కు గంటలకొద్దీ అతుక్కుపోవడంతో మానసిక, శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయి. మతి మరుపు దాడిచేస్తున్నది. వయస్సుతో సంబంధం లేకుండా అల్జీమర్ (మతిమరుపు) వ్యాధి ఇబ్బంది పెడుతున్నది. స్మార్ట్ ఫోన్ వినియోగంపై స్వీయ నియంత్రణ లేకుంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం మెదడుపై పడుతున్నది. బేసిక్ ఫోన్లు ఉన్న సమయంలో 10కి పైగా ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఒకట్రెండు కూడా కష్టమే. ఒకప్పుడు చిన్నచిన్న లెక్కల కోసం ఎక్కాల్ని స్మరించుకుంటూ చేతివేళ్లపై పూర్తి చేసేవాళ్లం. ఇప్పుడు చిన్నపాటి లెక్కలకూ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడంతోనే ఈ పరిస్థితి దాపురిస్తోంది. స్మార్ట్‌ని అతిగా వాడడంతో ఫలితంగా మెదడు మొద్దుబారిపోతున్నది.
చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తొలిదశలోనే మతిమరుపునకు చెక్ పెట్టకపోతే అది అనేక సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. పని పూర్తి చేసి గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం దగ్గరి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంట్లో మొబైల్ మరిచిపోవడం, జేబులో పర్స్ పెట్టుకోకపోవడం ఇలా తరచూ జరుగుతుంటే మతిమరుపు మొదలైనట్లే. గతంలో వృద్ధాప్యంలో మతిమరుపు, దృష్టి లోపం వంటివి ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉండేవి. కానీ సెల్‌ఫోన్ పుణ్యమా అని విద్యార్థులు, యువత సైతం ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మానసిక, న్యూరోసర్జన్ నిపుణుల వద్దకు 20శాతానికిపైగా కేసులు ఇలాంటివే వస్తున్నట్లు సమాచారం.
మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండే లా చూసుకోవాలి. ప్రొటీన్లు మాత్రం తప్పనిసరిగా శరీరానికి అందాలని చెబుతున్నారు. ఆహారంలో అధిక శాతం కొవ్వు ఉండడంతో మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్ర స్థానమైన హిప్పోకాంపస్ భాగం పనితీరు దెబ్బతింటుంది. అయితే ఒమెగా – 3 కొవ్వు ఆమ్లాలు మాత్రం మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలకు ఇది బాగా అవసరమంటున్నారు.
మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. నిద్ర కూడా కలత నిద్ర, మగతగా నిద్రించడం కాకుండా పూర్తిస్థాయి గాఢ నిద్ర ఉండాలి. రోజుకు కనీసం 6 నుంచి 8గంటల వరకు నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పని మధ్యలోనూ పది నుంచి పదిహేను నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి. మెలకువతో ఉన్నంత సేపు చూస్తున్నా.. వింటున్నా..అనుభూతి చెందుతున్న ప్రతి జ్ఞాపకం మెదడులో చేరుతోంది. వాటిని మెదడు ప్రాసెస్ చేస్తూ తదనుగుణంగా శరీర అవయవాలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మెదడులో కొన్ని రకాల ప్రొటీన్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండేలా ఆ ప్రొటీన్లు మెదడులో పేరుకుపోతూనే ఉంటాయి. దీంతో మనం దేనిపైనా ఏకాగ్రత పెట్టకపోవడం, ఆలోచించలేకపోవడం, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం జరుగుతుంది.
రోజూ ఉదయం యోగా చేస్తే అల్జీమర్స్ వ్యాధిని నియంత్రించవచ్చు. యోగాలో భాగమైన జ్ఞానముద్ర, ప్రాణాయామం, అనులోమ, విలోమ తదితర ప్రక్రియలను చేస్తే అల్జీమర్స్ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. విద్యార్థులు ప్రతి రోజూ యోగా చేస్తే జ్ఞాపకశక్తి నిలకడగా ఉంటుంది. ఇది చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది.
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి మార్కెట్లో లభించే మందులు, ఔషధాల వాడకంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏ రకమైన ప్రొటీన్లు, విటమిన్లు అయినా సహజ ఆహార రూపం లో తీసుకుంటేనే ప్రభావవంతంగా పనిచేస్తాయి. అడ్డగోలుగా సప్లిమెంట్లను వినియోగించడంతో అధిక రక్తపోటు, జీర్ణాశయ సమస్యలు, లైంగిక పటుత్వం కోల్పోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పిల్స్ వాడితే పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
-డాక్టర్ రవీంద్రమోహన్, సూపరింటెండెంట్, ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖాన