బాన్సువాడ, ఆగస్టు 10: డివిజన్ కేంద్రం బాన్సువాడలో అన్ని వసతులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని వారాంతపు సంత జరిగే ఎల్లయ్యచెరువు కట్టపై సుమారు రెండు ఎకరాల స్థలాన్ని సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం పరిశీలించారు. రూ.నాలుగు కోట్లతో మార్కెట్‌ను నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 142 నగర పాలక సంస్థల్లో ప్రజల అవసరాలను తీర్చేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అన్ని వసతులు ఉంటాయని తెలిపారు. అనంతరం ఆయన జడ్పీటీసీ పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. జడ్పీటీసీ పద్మ మామ పుల్లారెడ్డి ఇటీవల మరణించగా.. బాధిత కుటుంబీకులను ఓదార్చారు. స్పీకర్ వెంట ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఏఈ యుగంధర్రాజ్, బల్దియా చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ గురువినయ్‌కుమార్, కౌన్సిలర్లు నంద కిశోర్, సత్యం, నాయకుడు ఎజాస్ తదితరులున్నారు
అర్హులందరికీ ‘డబుల్’ ఇండ్లు
పట్టణంలోని 8, 9, 10, 11, 12 వార్డుల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిక్ బగ్గీలో మంగళవారం పర్యటించారు. ఆయా వార్డుల్లో శాంతినగర్, గూడెంగల్లి, హరిజన వాడ, పాత బాన్సువాడ చావిడి, నడిగడ్డ, చైతన్యకాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పలువురు లబ్ధిదారులు నిర్మించుకుంటున్న డబుల్‌బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. తమకు పింఛన్ రావడం లేదని, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని పలువురు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. సొంత స్థలాలు ఉండి, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.