గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 18, 2020 , 00:34:27

ప్రచార హోరు

ప్రచార హోరు
  • -వార్డుల్లో నాయకుల పర్యటనలు
  • -రోడ్‌షో నిర్వహించిన ఎమ్మెల్యే జోగు రామన్న
  • -ఇంటింటా ప్రచారం చేపట్టిన జడ్పీ, డీడీసీ చైర్మన్‌లు
  • -వార్డుల్లో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, మాజీ ఎంపీ నగేశ్‌ ప్రచారం
  • -స్థానికుల నుంచి విశేష స్పందన

ఆదిలాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రెండ్రోజులుగా పట్టణంతో పాటు మున్సిపల్‌ పరిధిలోని శివారు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, మాజీ ఎంపీ జి.నగేశ్‌ పట్టణంలో పలు వార్డుల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. నాయకులతో పాటు వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, తమ అనుచరులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పలు వార్డుల్లో రోడ్‌షో నిర్వహించి గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధిని గత పాలకులు విస్మరించారని ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చినట్లు తెలిపారు. ప్రతి వార్డులో రహదారులు, మురికి కాల్వల నిర్మాణం, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం లాంటి వాటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి ఇంటింటా ఓటర్లను కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే మరింత పట్టణాభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

ప్రచారానికి విశేష స్పందన..

ప్రచారంలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులకు స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పలు వార్డుల్లో నాయకులకు వారు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని వారు నాయకులకు వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయని, తమ ఉపాధి ఎంతగానో మెరుగుపడిందని ప్రజలు టీఆర్‌ఎస్‌ నాయకులకు తెలియజేస్తున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రూ.1 కిలో బియ్యం, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి లాంటి పథకాలతో పట్టణంలో అర్హులైన వారందరికీ వర్తించగా వారు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు అండగా నిలువనున్నారు.logo