ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావచ్చన్న అంచనాలతో వ్యవసాయ రంగం పుంజుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన మర్నాడే ఏడీబీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
గత నెలలో ఆర్బీఐ భారత వృద్ధి రేటు అంచనాను 7 నుంచి 7.2 శాతానికి పెంచింది. 2024 ఏప్రిల్‌లో అంచనా వేసినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో 7 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 7.2 శాతం వృద్ది రేటును నమోదు చేసే అవకాశం ఉందని జూలై నెలకు విడుదల చేసిన అంచనాల్లో ఏడీబీ వెల్లడించింది.
2023-24 నాలుగో త్రైమాసికంలో సేవల రంగ వృద్ధి కొనసాగింది. సేవల రంగ పీఎంఐ సూచీ కూడా దీర్ఘకాల సగటును మించే అవకాశం ఉంది. తయారీ, నిర్మాణ రంగానికి బలమైన గిరాకీ వల్ల పారిశ్రామిక రంగాలు కూడా రాణించవచ్చని ఏడీబీ వివరించింది. ఎగుమతుల వృద్ధిలోనూ సేవల రంగం కీలక పాత్ర పోషించడం కొనసాగిస్తుందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యస్థితి అంచనాకు మించి పటిష్ఠంగా ఉండటం వృద్ధికి ఊతంగా నిలుస్తుందని విశ్లేషించింది. వాతావరణ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు లాంటివి వృద్ధికి ప్రతికూలంగా నిలిచే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం అంచనాను 4.6 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతానికి దిగి రావచ్చని విశ్లేషించింది.
2024 సంవత్సరానికి ఆసియా ప్రాంత వృద్ధిరేటును 5 శాతానికి సవరించింది. 2025కు ఎటువంటి మార్పు చేయకుండా 4.9 శాతంగా కొనసాగించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ‘ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన (లాడ్లా భాయ్ యోజన)’ అనే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.
దీని ద్వారా నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతలను బట్టి నెల నెలా బ్యాంకు అకౌంట్లలో స్టయిఫండ్‌ను జమ చేయనున్నారు. ఇందుకు రూ.5,500 కోట్లు వెచ్చించనున్నారు.
18-35 ఏళ్లు వయసు గల మహారాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు. కనీసం 12 తరగతి పాసై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు.
ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించడంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.
6 నెలల ఇంటర్న్‌షిప్‌లో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.6వేలు, ఐటీఐ/ డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.8 వేలు, డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారికి రూ.10 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లించనున్నారు.
ఒకవైపు భారత్‌లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న మహిళలు మరోవైపు భారతీయ మూలాలు ఉన్న మహిళలు ప్రపంచ
రాజకీయాల్లో సత్తా చాటి తమను తాము నిరూపించుకుంటున్నారు.
అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్ ఇలా అనేక దేశాల్లో భారత మూలాలున్న మహిళలు ప్రజల మన్ననలు పొంది చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. వివిధ దేశాల్లో వేర్వేరు వృత్తులతో పాటు రాజకీయాల్లోనూ భారత మూలాలున్న మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు.
ఒకనాడు భారత్‌ను పాలించిన బ్రిటన్ రాజకీయాల్లో నేడు భారత మహిళలు బ్రిటిష్ పార్లమెంట్లో అధికారం చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో 26 మంది బ్రిటిష్-ఇండియన్లు పార్లమెంటుకు ఎన్నికవగా వీరిలో 15 మంది మహిళలే ఉన్నారు. గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పని చేసిన ప్రీతి పటేల్ ఈసారి ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు ఉన్నాయి.
29 ఏండ్లకే యూకే పార్లమెంటులో అడుగుపెట్టిన శివానీ రాజా సంచలనం సృష్టించారు. ఈమె భగవద్గీత మీద ప్రమాణం చేసి తన దేశంపై ఆమెకున్న దేశభక్తిని చాటారు. లేబర్ పార్టీ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన నదియా విట్టోమ్ కూడా బ్రిటన్ రాజకీయాల్లో కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో ఆమె 23 ఏండ్ల వయస్సులోనే మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికై అతి పిన్న వయస్కురాలైన ఎంపీగా చరిత్రకెక్కారు.
కెనడా రాజకీయాల్లోనూ భారత మూలాలున్న మహిళా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2021లో జరిగిన కెనడా పార్లమెంటు ఎన్నికల్లో 17 మంది భారత మూలాలున్న వారు గెలవగా, వీరిలో ఆరుగురు మహిళలే.
వీరిలో అనిత ఇందిరా ఆనంద్ కెనడా ట్రెజరీ బోర్డుకు అధ్యక్షురాలిగా కీలక పదవిని నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె మంత్రిగా పని చేశారు. మరో ఎంపీ కమల్ ఖేరా ప్రస్తుతం కెనడా మంత్రిగా ఉన్నారు. ఆమె పూర్వీకులు ఢిల్లీకి చెందిన వారు. మరో మహిళా ఎంపీ బర్దీశ్ ఛగ్గర్ కూడా మంత్రిగా పని చేశారు.
అమెరికా, కెనడా, యూకే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ భారత మహిళలు రాజకీయంగా రాణిస్తున్నారు. న్యూజిలాండ్‌లో ప్రియాంక రాధాకృష్ణన్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి 2023 వరకు ఆమె మంత్రిగా పని చేశారు. ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లోనూ భారత మూలాలున్న మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున మరోసారి ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ ఉపాధ్యక్ష పదవికి తెలుగు దంపతుల కూతురు ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ పోటీ చేస్తున్నారు. కమలా హారిస్ ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా, మొదటి బ్లాక్ అమెరికన్‌గా, మొదటి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మరోవైపు అమెరికా రాజకీయాల్లో నిక్కీ హేలీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలసవెళ్లారు. ఆమె రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడి ఓడిపోయారు.
ప్రతి సంవత్సరం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ‘వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
‘పేదరికం-అసమానతలను ఎదుర్కోవడం ఇంకా మన చేతుల్లోనే ఉంది’.
సామాజిక న్యాయం పట్ల మండేలా జీవితకాల నిబద్ధతతో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. అతని కాలం నుంచి గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ పేదరికం, అసమానత సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతుంది.
మండేలా గౌరవార్థం ఆయన పుట్టినరోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబర్ 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న 192 మంది సభ్యులు ఆమోదించగా, ప్రతి సంవత్సరం జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకి తీర్మానించారు.
2009, ఏప్రిల్ 27న ‘నెల్సన్ మండేలా ఫౌండేషన్’ మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రపంచ దేశాల మద్దతును ఆహ్వానించింది. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటం, ప్రపంచ వ్యాప్తంగా శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి నెల్సన్ మండేలా చేసిన కృషిని గుర్తించేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు. నెల్సన్ మండేలా దినోత్సవం అందరికీ చర్య తీసుకోవడానికి, మార్పును ప్రేరేపించడానికి ఒక సందర్భం లాంటిది.
1918, జూలై 18న దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌కీలో జన్మించారు. అతడి పేరు నెల్సన్ రోలిహ్లాలా మండేలా.
నెల్సన్ మండేలా (1918-2013) మానవ హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రపంచం మంచి ప్రదేశంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ తమ వర్గాల్లో ఒక వైవిధ్యాన్ని చూపించాలని అభిప్రాయపడ్డాడు. అతను 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు. అతను ANC యూత్ లీగ్ (ANCYL) ఏర్పాటుకు సహాయం చేశాడు.
1993లో నెల్సన్ మండేలా, ఫ్రెడరిక్ విల్లెం డి క్లెర్క్‌లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ‘వర్ణవివక్ష పాలనను శాంతియుతంగా రద్దుచేసినందుకు, కొత్త ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికాకు పునాదులు వేసినందుకు’ ఈ బహుమతి లభించింది.
1990లో భారతరత్నను భారత్ ప్రదానం చేసింది.
మండేలా 1999లో రాజకీయాల నుంచి పదవీ విరమణ చేశారు. 5 డిసెంబర్ 2013 వరకు శాంతి కోసం ప్రపంచ న్యాయవాదిగా కొనసాగారు. మండేలా జొహాన్నెస్‌బర్గ్‌లోని తన స్వగృహంలో మరణించారు.
20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాల్లో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు.
పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల జోక్యంతో దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఎన్సీపీసీఆర్ ఆధ్వర్యంలో ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ (ICP) పరిశోధక బృందం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (2019-21) డేటాను విశ్లేషించి వెల్లడించిన నివేదిక ప్రకారం 2023-24లో గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలో 59,364 బాల్య వివాహాలను అడ్డుకోగా ఇదే సమయంలో 17 రాష్ర్టాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 265 జిల్లాల్లో ఉన్న 161 పౌర సమాజ సంస్థలు 14 వేలకు పైగా బాల్య వివాహాలను నిరోధించాయి.
బాల్య వివాహాలు జరిగితే పంచాయతీలూ బాధ్యత వహించాల్సిందేనంటూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో వాటి సంఖ్య అధికంగా తగ్గుముఖం పట్టిందని నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది.
అస్సాంలో 30% గ్రామాల్లో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించగా, 40% గ్రామాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది.
పెండింగులో ఉన్న బాల్య వివాహ కేసుల ప్రక్షాళనకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఎన్సీపీసీఆర్ నివేదిక సిఫారసు చేసింది.
తల్లిదండ్రులు, సంరక్షకులు, గ్రామపంచాయతీలు బాధ్యులుగా ఉన్న బాల్యవివాహాల కేసులను అత్యాచారానికి పాల్పడిన కుట్రతో సమానంగా భావించాలని, బాధిత చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారితో సమానంగా పరిగణించాలని సూచించింది.
బాల్య వివాహాల నిరోధానికి మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని, ‘ర్యాపిడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్రొటోకాల్”తో బాల్య వివాహాలను అడ్డుకోవడానికి అత్యవసర సెంట్రల్ పోర్టల్‌ను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.
దేశంలో బాల్య వివాహాలను మొదటిసారి 1929లో నిషేధించారు.
బాల్య వివాహాలను అరికట్టడం వల్ల మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, లింగ సమానత్వాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.