JEE Advanced Exam | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఐఐటీల్లోని సీట్లభర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 18న జాతీయంగా పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 2.5 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం అడ్మిట్‌కార్డులను విడుదల చేయనున్నా రు.
యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దు రాష్ర్టాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. పంజాబ్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్‌లలో విద్యాసంస్థలకు సెలవులిచ్చారు. దీంతో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందా? లేదా? అన్న అనిశ్చితి నెలకొన్నది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో యుద్ధ వాతావరణం నుంచి దాదాపు బయటపడ్డట్టే. మళ్లీ ఏదైనా ఉద్రిక్తతలు తలెత్తితే మాత్రం పరీక్షలు జరగడం అనుమానంగానే కనిపిస్తుంది. 13నుంచి సీయూఈటీ (యూజీ) పరీక్షలు జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గల సెంట్రల్ యూనివర్సిటీల్లో మూడేండ్ల యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈనెల 7న సిటీ ఇంటిమేషన్ స్లిప్ (ఏ నగరంలో పరీక్ష రాయనున్నారో) వివరాలను మాత్రమే ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌కార్డులు విడుదలవుతాయి. శనివారం వరకు విడుదల కాలేదు.
ఇంటర్ సప్లిమెంటరీకి 4.2 లక్షల మంది
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షా కేంద్రాలను ఇంటర్‌బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.