హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): గ్రూప్ –1 నోటిఫికేషన్ విడుదలపై టీఎస్పీఎస్సీ శనివారం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. గ్రూప్–1పై ఇప్పటికే దశల వారీగా సమావేశాలు నిర్వహించిన కమిషన్, శనివారం మరోసారి సమావేశమవుతున్నది. ఈ అంశంపై అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఒకటికి రెండు సార్లు క్షేత్రస్థాయిలో చర్చించింది. మూడు వారాల క్రితమే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయటంతో వాయిదా పడింది. దీనితోపాటు కొత్త జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా కమిషన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది.
గతంలో జరిగిన పొరపాట్లను అధ్యయనం చేసి, మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకొంటున్నది. రెండుమూడు శాఖల నుంచి వచ్చిన నివేదికలను కొన్ని సవరణల కోసం పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, నోటిఫికేషన్ జారీపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సమావేశం తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉన్నట్టు వెల్లడించాయి.