దేశవ్యాప్తంగా ఏటా నిర్వహించే పోటీపరీక్షలకు లక్షల సంఖ్యలో పోటీపడుతుంటారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకున్నవారి నుంచి ఇప్పటికే పోటీపరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారి వరకు వివిధ రకరకాల అభ్యర్థులు ఇందులో ఉంటారు. ఉద్యోగాల జాబితా కూడా చాలా పెద్దది. ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. విద్యార్హతలు, ఆలోచనా పరిజ్ఞానం, వెచ్చించగలిగే సమయం ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుకూలమైన పరీక్షకు ప్రిపేరవుతుంటారు. పోటీపరీక్షల్లో చాలా వరకు సిలబస్‌లో కొంత సామీప్యత, మరికొంత వైవిధ్యత కనిపిస్తుంటుంది. దానిని బట్టి అనుసరించే విధానం మారుతుంటుంది. అయితే పరీక్ష ఏదైనా సరే ఉమ్మడి అంశం ఒకటి ఉంటుంది. అదే ఓపిక.
పోటీ పరీక్షలో రాణించాలనేవారికి కావాల్సిన మొదటి లక్షణం ఓపికతో వ్యవహరించగలగడం. పరీక్షకు అవసరమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో, నేర్చుకోవడంలో ఓపిక అనే చాలా అవసరం. అదే సమయంలో పరీక్షను ఎదుర్కొనే క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను దాటుకుని వెళ్లాలన్నా ఓపిక అవసరం అవుతుంది. సబ్జెక్టుల పరంగానే కాదు సహనానికి సంబంధించిన పరీక్ష కూడా ఎదుర్కోవాలి. అంటే అనుకున్న సమయంలో నోటిఫికేషన్ రాకపోవడం, లేదంటే మొదటి ప్రయత్నంలోనో మరో ప్రయత్నంలోనో సరైన విజయం దక్కకపోవడం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా ఓపికతో వ్యవహరించాలి. ఓపిక ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది.
నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఏమాత్రం నిరాశ చెందినా, సహనం కోల్పోయినా, ఆలోచనా సరళి మారినా మరో గమ్యం వెదుక్కోవాల్సి వస్తుంది. ప్రయాణం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. అందుకే ఎంచుకున్న మార్గంలోనే మన ప్రయత్నం, ప్రయాణం కొనసాగాలి.
సానుకూల దృక్పథం, దీనినే పాజిటివ్ థింకింగ్ అంటుంటాం. ఇది మనిషికి ఆక్సిజన్ లాంటిది. మన ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. అవి చర్యలను నిర్దేశిస్తాయి. చర్యలు విజయాన్ని నిర్దేశిస్తాయి. ఎంచుకున్న పరీక్షకు సంబంధించి మొదట సానుకూల దృక్పథంతో ఉండాలి. అది మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. అది ఎలాంటి చర్యలకయినా సిద్ధం చేస్తుంది. ఆ ఉత్సాహం, ఆ ధైర్యం విజయం వైపు నడిపిస్తాయి.
పోటీపరీక్షల్లో దాదాపు రోజూ ఒకే తరహా దినచర్య ఉంటుంది. అంటే దాదాపు అన్ని విషయాలు పుస్తకాలతోనే ముడిపడి ఉంటాయి. ఈ ప్రిపరేషన్‌కి కాస్త వైవిధ్యతని జోడించడం ద్వారా సుదీర్ఘమైన ఈ ప్రయణాన్ని కాస్త సుఖవంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదవడమే పనిగా పెట్టుకోకూడదు. కొన్నిసార్లు నోట్స్ రాసుకోవాలి, మరికొన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ కూడా కొన్నిసార్లు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు, మరికొన్నిసార్లు వ్యాసరూప ప్రశ్నలు ఎంచుకోవాలి. కేవలం చదవడంపైనే దృష్టిపెట్టడం కంటే ఇలా చేయడం వల్ల నూతనోత్తేజం ఏర్పడుతుంది.
ఒక పరీక్ష కోసం ప్రిపేరవుతున్నప్పటికీ ఈ మధ్యలో అదే సిలబస్‌తో మరేవైనా నోటిఫికేషన్లు వస్తే వాటిని కూడా రాయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఈ ప్రిపరేషన్ని సాఫీగా సాగేలా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ ఉద్యోగాలు కూడా రావచ్చు. చిన్న విజయమైనా అమితమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
ఏ రకమైన పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నప్పటికీ ఆ పరీక్షకు సంబంధించి, లేదంటే ఆ పరీక్షకు అవసరమైన శక్తియుక్తులకు సంబంధించి ఏవో ఊహాగానాలు వినిపిస్తుంటాయి. అవి దృష్టి మరల్చే ప్రమాదం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందు మనపై మనకు విశ్వాసం ఉండాలి. అది మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి ఎంచుకున్న పరీక్షపై బలాలపై విశ్వాసం ఉంచండి. చిన్న చిన్న బలహీనతలేమైనా ఉంటే అధిగమించడానికి ప్రయత్నం చేయడం.
ఒక పెద్ద లక్ష్యాన్ని ఛేదించడానికి ముందుగా చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు ఒక నెలలో ఒక సబ్జెక్ట్ పూర్తిగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారనుకుందాం. ముందుగా ఈ వారానికి సంబంధించి ఎంతవరకు చదవాలనేది నిర్దేశించుకోవాలి. ఆ తర్వాత ఈ రోజు ఏం చదవాలో ప్రణాళిక వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిర్దేశించుకున్న ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయవచ్చు. అంతేకాకుండా ఏదైనా స్వల్పకాలిక లక్ష్యం చేరుకోగానే తెలియని ఆనందం ఏర్పడుతుంది. తద్వారా మరిన్ని లక్ష్యాలు చేరుకోవాలనే తపన కలుగుతుంది.
పరిస్థితులు, వాటి ప్రభావాలు తాత్కాలికం. కోరుకున్న విజయం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. సహనంతో వ్యవహరిస్తే ఏదో ఒక రోజు తప్పక విజయం కలుగుతుంది.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ స్టడీ సర్కిల్
హైదరాబాద్