OU Convocation | ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చే నెల మూడో వారంలో నిర్వహించనున్నారు. పట్టాలు, పతకాలు స్వీకరించదలిచిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు.
2022-23, 2023-24 విద్యాసంవత్సరాలలో అన్ని డిప్లొమా, యూజీ, పీజీ, ఎంఫిల్ తదితర కోర్సులు పూర్తి చేసి బంగారు పతకాలు పొందినవారు (దూరవిద్యా విధానంతో సహా) స్నాతకోత్సవంలో తమ పట్టాలు, పతకాలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని శశికాంత్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీ వరకు పీహెచ్డీ పట్టాలు పొందినవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలోకి ప్రవేశించి సంబంధిత రుసుము చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
అన్ని పీహెచ్డీ పట్టాలు, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులకు సంబంధించిన బంగారు పతకాలన్నింటినీ స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. యూజీ బంగారు పతకాలను స్నాతకోత్సవం అనంతరం సంబంధిత కళాశాలల నుంచి పొందవచ్చన్నారు. శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు తెలిపారు. స్నాతకోత్సవంలో పట్టాలు స్వీకరించదలిచిన వారు వచ్చే నెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.