ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి పర్యవసానం తెలిసి మాట్లాడారా..లేదా అలవాటులో భాగంగానే మాట్లాడారో అంతుపట్టడం లేదు.
నిరుడు పద్మ’ అవార్డులకు తమ ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం ఆమోదించకపోవడంతో ఆయన బాహాటంగానే చిందులు తొక్కారు. పురస్కారాలకు తమ ప్రభుత్వం సిఫారసు చేసిన పలువురు వ్యక్తుల పేర్లకు కేంద్రం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన చేసిన ప్రకటనలు మీడియాలో వెలువడ్డాయి. ఈ పురస్కారాల ఎంపికలో తాము ప్రతిపాదించిన పేర్లను పక్కకు పెట్టడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సిఫారసు చేసిన పేర్లను కూడా సీఎం బయటపెట్టారు. దివంగత గద్దర్‌కు మరణానంతరం పద్మవిభూషణ్, విద్యావేత్త చుక్కా రామయ్యకు, కవి అందెశ్రీకి పద్మభూషణ్, గేయ కవి గోరటి వెంకన్న, ఆదివాసీ జానపద పరిశోధకుడు జయధీర్ తిరుమలరావుకు పద్మశ్రీ ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.
ఒకసారి తాము సిఫారసు చేసిన పేర్లు బయటపెట్టారంటే వారికి ఆ పురస్కారాలు అందేలా చూసే బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు పేర్లు బయటికి చెప్పడం వారిని నిరాశ పర్చడమే కాకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి ద్రోహం చేసినట్టు కూడా అవుతుంది. విచిత్రమేమిటంటే.. కేంద్ర ప్రభుత్వం 2026 కోసం ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతల్లో పైన పేర్కొన్న పేరొక్కటి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఆ పేర్లను ఈసారి కూడా కేంద్రం పక్కన పెట్టిందా లేదా రాష్ట్ర ప్రభుత్వమే ఆ పేర్లను మరోమారు జాబితాలో చేర్చలేదా అనే అనుమానం సర్వత్రా వినిపిస్తున్నది. గత సంవత్సరం చెప్పినట్టే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాల కోసం సిఫారసు చేసిన పేర్లను బయటపెడితే బాగుంటుంది. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు పేర్లు మరోసారి సిఫారసు చేశారా? లేదా? చేయనట్టయితే ఎందుకు చేర్చలేకపోయారో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్ పురస్కారం లభించగా, విజ్ఞాన శాస్త్ర రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్‌రెడ్డి, పశుసంవర్ధక రంగంలో మామిడి రామారెడ్డి, విద్యారంగం నుంచి మామిడాల జగదీశ్ కుమార్, కళారంగం నుంచి దీపికారెడ్డికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. సేవా, కళా తదితర రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలు, అంకితభావాన్ని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేశారని సీఎం పేర్కొన్నారు. గతంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, నటుడు చిరంజీవితో పాటు ఇతరులను ముఖ్యమంత్రి శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ఘనంగా సన్మానించనున్నారు.
అంతా బాగానే ఉది కానీ గతంలో తాను బాధపడుతూ ప్రకటించిన తెలంగాణ మట్టి బిడ్డలకు పద్మ పురస్కారాలు ఈసారి కూడా రాలేదే అనే స్పృహ, బెంగ ఆయనలో ఏ కోశానా కనబడడం లేదు. పోయినేడు తాను ప్రకటించిన అసహనం లేఖ రూపంలో ప్రధానమంత్రికి చేరిందో లేదో! ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున ‘పద్మ’ పురస్కారాలకు సిఫారసు చేసిన పేర్లను బయటపెడితే గానీ తప్పు కేంద్రానిదా లేక రాష్ర్టానిదా అనే విషయం తేలదు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందినవారికి హైదరాబాద్‌లో ఉన్న శాస్త్ర పరిశోధన, వైద్య సంస్థల్లో పనిచేయడం వల్ల లభించిన పురస్కారాలు తెలంగాణ జాబితాలో వేయడం వల్ల ఓ రకంగా స్థానికులకు అన్యాయం జరిగినట్టే. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మౌనం పలు అనుమానాలకు తావిస్తున్నది.
-బద్రి నర్సన్