e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

అంతర్జాతీయం

నార్వే ప్రధానికి జరిమానా
కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు నార్వే ప్రధాన మంత్రి ఎర్నా సోల్‌బెర్గ్‌కు ఆ దేశ పోలీసులు ఏప్రిల్‌ 3న రూ.1,75,690 జరిమానా విధించారు. ఆమె ఫిబ్రవరిలో తన 60వ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కరోనా నిబంధనలు అతిక్రమించారని పోలీసులు తెలిపారు. నార్వే ప్రస్తుత రాజు హరాల్డ్‌ వీ, రాజధాని ఓస్లో, కరెన్సీ నార్వేజియన్‌ క్రోన్‌.

ప్రపంచ బిలియనీర్ల జాబితా
ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ 35వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాను ఏప్రిల్‌ 7న విడుదల చేసింది. ఈ జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ వరుసగా నాలుగోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఎలాన్‌ మస్క్‌ 2, బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ 3, బిల్‌గేట్స్‌ 4, మార్క్‌ జుకర్‌బర్గ్‌ 5, వారెన్‌ బఫెట్‌ 6, లారీ ఎలిసన్‌ 7, లారీ పేజ్‌ 8, సెర్గీ బ్రిన్‌ 9, ముకేశ్‌ అంబానీ 10వ స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో చైనా, భారత్‌, జర్మనీ, రష్యా ఉన్నాయి. అమెరికాలో 724, చైనాలో 698, భారత్‌లో 140, జర్మనీలో 136, రష్యాలో 117 మంది బిలియనీర్లు ఉన్నారు.

వ్యోమగాములతో సోయజ్‌
రష్యా వ్యోమనౌక సోయజ్‌ ఎంఎస్‌-18 ముగ్గురు వ్యోమగాములతో ఏప్రిల్‌ 9న కజకిస్థాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పయనమైంది. ఈ నౌక భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌) చేరుకుంది. వ్యోమగాముల్లో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన మార్క్‌ వాండె హెచ్‌, రష్యాకు చెందిన ఒలెగ్‌ నోవితిస్కీ, ప్యోటర్‌ దుబ్రోవ్‌లు ఉన్నారు.

జాతీయం

చీనాబ్‌ బ్రిడ్జి ఆర్చి
జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైలు లింక్‌ ప్రాజెక్టులో చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న బ్రిడ్జి స్టీల్‌ ఆర్చి పూర్తయిందని భారతీయ రైల్వే శాఖ ఏప్రిల్‌ 5న వెల్లడించింది. కశ్మీర్‌ లోయను మిగతా దేశంతో కలపడానికి వీలుగా రైల్వేశాఖ రూ.27,949 కోట్లతో ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టు చేపట్టింది. దీనిలో భాగంగా రూ.1486 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తుంది. దీంతో కాట్రా-బనిహాల్‌ మధ్య 111 కి.మీ. రైల్వేలైను నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయవచ్చని తెలిపింది.

కరెంట్ అఫైర్స్

లా పెరోస్‌ విన్యాసాలు
తూర్పు హిందూ మహాసముద్ర జలాల్లో తొలిసారి బహుళపక్ష మారిటైం విన్యాసాలు ఏప్రిల్‌ 5న ప్రారంభమై 7న ముగిశాయి. ‘లా పెరోస్‌’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాల్లో భారత్‌తోపాటు ఫ్రెంచ్‌ నేవీ, రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ, జపాన్‌ మారిటైం, అమెరికా నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌, ఐఎన్‌ఎస్‌ సాత్పూర, అమెరికాకు చెందిన సిరియస్‌, అకెబోన్‌, సర్కోఫ్‌, అంజాక్‌ నౌకలు పాల్గొన్నాయి.

అంటువ్యాధుల నమోదుకు యాప్‌
దేశవ్యాప్తంగా అంటువ్యాధుల నమోదుకు ప్రత్యేక యాప్‌ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ 5న ప్రారంభించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 33 రకాల అంటువ్యాధులు ఎక్కడ ప్రబలినా వెంటనే తెలిసిపోతుంది. ఇతర రాష్ర్టాలకు వ్యాప్తి చెందకుండా తక్షణమే నివారణ చర్యలు తీసుకోవడానికి యాప్‌ దోహదపడుతుంది. తెలంగాణలో ఈ యాప్‌ను 2018 నుంచి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని వైద్యారోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

బ్రిక్స్‌ ఆర్థిక మంత్రుల సమావేశం
బ్రిక్స్‌ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్‌ సమావేశం ఏప్రిల్‌ 6న నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. విధానపరమైన మద్దతుకుతోడు, అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడం, బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారాన్ని ఇనుమడింపజేయడం తదితర అంశాలపై చర్చించారు.

పుస్తకావిష్కరణ
ప్రధాని మోదీ శంకర్‌లాల్‌ పురోహిత్‌ హిందీలోకి అనువదించిన ‘ఒడిశా ఇతిహాస్‌’ పుస్తకాన్ని ఏప్రిల్‌ 9న ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్కళ్‌ కేసరి, ఒడిశా మొట్టమొదటి సీఎం హరేకృష్ణ మహ్తాబ్‌ రచించారు.

వార్తల్లో వ్యక్తులు

ఖాండ్వావాలా
బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీయూ) చీఫ్‌గా షాబిర్‌ హుస్సేన్‌ షేఖదమ్‌ ఖాండ్వావాలా ఏప్రిల్‌ 5న నియమితులయ్యారు. ఆయన గతంలో గుజరాత్‌ డీజీపీగా పనిచేశారు. ఆయన అజయ్‌సింగ్‌ స్థానంలో నియమితులయ్యారు.

జస్టిస్‌ ఎన్‌వీ రమణ
సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏప్రిల్‌ 6న ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతులు చేపడుతున్న తెలుగువారిలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ రెండోవారు. గతంలో 9వ సీజేఐగా జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966-67 మధ్యకాలంలో పనిచేశారు.

రాజేశ్వర్‌రావు కొలనుపాక
నీతిఆయోగ్‌ ప్రత్యేక సెక్రటరీగా కొలనుపాక రాజేశ్వర్‌రావు ఏప్రిల్‌ 6న నియమితులయ్యారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం నీతిఆయోగ్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.

తరుణ్‌ బజాజ్‌
కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్‌ ఏప్రిల్‌ 6న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన హర్యానా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

పుష్పిక డి సిల్వా
మిసెస్‌ శ్రీలంక-2021 ఏప్రిల్‌ 7న నిర్వహించిన పోటీల్లో విజేతగా పుష్పిక డి సిల్వాను న్యాయనిర్ణేతలు ప్రకటించారు. పెళ్లి చేసుకున్నవారే ఈ పోటీకి అర్హులని, విడాకులు తీసుకున్నవారు కాదని 2019 మిసెస్‌ శ్రీలంక విజేత కరోలిన్‌ జూరీ తెలుపుతూ పుష్పికకు పెట్టిన కిరీటాన్ని తీసి రన్నరప్‌ తలపై ధరించారు. భర్తకు దూరంగా ఉంటున్నానని, విడాకులు తీసుకోలేదని పుష్పిక స్పష్టం చేసింది. దీంతో నిర్వాహకులు తిరిగి కిరీటాన్ని పుష్పికకు ఇచ్చారు.

ధనంజయులు
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ (పీసీఓం)గా ఆర్‌ ధనంజయులు ఏప్రిల్‌ 7న బాధ్యతలు చేపట్టారు. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌) 1988 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో విజయవాడ రైల్వే మేనేజర్‌గా, వైజాగ్‌లో ఏర్పాటుకానున్న సౌత్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రత్యేకాధికారిగా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు.

ప్రవీణ్‌ జొన్నలగడ్డ
అమెరికాలోని కామ్‌స్కోప్‌ సంస్థకు సీఐవో (చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌)గా ప్రవీణ్‌ జొన్నలగడ్డ ఏప్రిల్‌ 8న నియమితులయ్యారు. ఈయన తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందినవారు. నెట్‌వర్కింగ్‌లో వైర్‌లెస్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సౌకర్యాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడమే కామ్‌స్కోప్‌ లక్ష్యం.

గిన్నిస్‌ రికార్డులు
భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌ అయిన భరత్‌ పన్ను రెండు కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడని గిన్నిస్‌ బుక్‌ వర్గాలు ఏప్రిల్‌ 8న తెలిపాయి. 2020, అక్టోబర్‌ 10న లేహ్‌ నుంచి మనాలి వరకు 472 కి.మీ. దూరాన్ని కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్‌ తొక్కి రికార్డు నెలకొల్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను కలిపే ‘స్వర్ణచతుర్భుజి’ రహదారిగా పేరొందిన రోడ్డు మార్గాన్ని 14 రోజుల 23 గంటల, 52 సెకన్లలో సైకిల్‌పై పూర్తిచేసి మరో కొత్త గిన్నిస్‌ రికార్డును సృష్టించారు.

ఫిలిప్‌
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త 99 ఏండ్ల ఫిలిప్‌ ఏప్రిల్‌ 9న మరణించారు. ఆయన గ్రీకు, డెన్మార్క్‌ రాజకుటుంబాల వారసుడు. అప్పటి బ్రిటన్‌ రాజు జార్జ్‌-6 కుమార్తె ఎలిజబెత్‌ను వివాహం చేసుకోవడానికి గ్రీస్‌, డెన్మార్క్‌ రాచరికపు వారసత్వాన్ని వదులుకుని బ్రిటన్‌ పౌరుడిగా మారారు. ఆయన 1961, 1983, 1997 సంవత్సరాల్లో భారత్‌ను సందర్శించారు.

క్రీడలు

మియామి ఓపెన్‌ విజేత హుబర్ట్‌
టెన్నిస్‌ మియామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో పోలెండ్‌ క్రీడాకారుడు హుబర్ట్‌ హుర్కాజ్‌ విజేతగా నిలిచాడు. ఏప్రిల్‌ 5న జరిగిన ఫైనల్లో హుబర్ట్‌ ఇటలీకి చెందిన జానిక్‌ సినెర్‌పై గెలుపొందాడు. అతడి కెరీర్‌లో ఇదే తొలి మాస్టర్స్‌ టైటిల్‌.

అమెరికా హాకీ కోచ్‌గా హరేంద్ర
అమెరికా పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా భారత హాకీ జట్టు మాజీ కోచ్‌ హరేంద్రసింగ్‌ ఏప్రిల్‌ 8న నియమితులయ్యాడు. ఆయన 2017-18లో భారత సీనియర్‌ పురుషులు, మహిళల జట్లకు చీఫ్‌ కోచ్‌గా పనిచేశాడు. 2018 మస్కట్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో పురుషుల జట్టు స్వర్ణం గెలవడంలో ఆయన కీలకపాత్ర పోషించాడు. 2012లో ద్రోణాచార్య అవార్డు పొందాడు.

కరెంట్ అఫైర్స్

వేముల సైదులు
జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు
ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ హైదరాబాద్

Advertisement
కరెంట్ అఫైర్స్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement