e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ‘గార్డియన్‌ మినిస్టర్స్‌'ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?

‘గార్డియన్‌ మినిస్టర్స్‌’ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?

‘గార్డియన్‌ మినిస్టర్స్‌'ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?
 1. ప్రపంచ ఆరోగ్య సంస్థ బయోహబ్‌ను ప్రారంభించింది. దీనివల్ల ప్రయోజనం ఏంటి? (ఎ)
  ఎ) జీవశాస్త్ర పదార్థాలను పంచుకోవడం
  బి) వైరస్‌లను ముందే గుర్తించడం
  సి) కొవిడ్‌ టీకా ప్రక్రియ వేగవంతం
  డి) కొవిడ్‌ జన్యువుల గుర్తింపు
  వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్విట్జర్లాండ్‌లు బయోహబ్‌ను ప్రారంభించనున్నాయి. ఇందుకు ఇరుపక్షాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జీవశాస్త్ర పదార్థాలను సభ్య దేశాలతో పరస్పరం పంచుకోవడానికి బయోహబ్‌ ఉపయోగపడుతుంది. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉంటాయి. జీవ భద్రతతో పాటు ఇతర నియంత్రణలు భాగంగా ఉంటాయి. స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌ అనే పట్టణం కేంద్రంగా ఇది పని చేస్తుంది. తున్‌ అనే నది ఒడ్డున ఈ పట్టణం ఉంది.
 2. బెలారస్‌పై ఈయూ ఆంక్షలు విధించడానికి కారణం? (డి)
  ఎ) అణు పరీక్షలు చేసేందుకు ఆ దేశం
  సమాయత్తం కావడం
  బి) తరచూ ఆ దేశం తన కరెన్సీ విలువను తగ్గించడం
  సి) యూరోపియన్‌ యూనియన్‌లో ఉంటూ నిబంధనలు ఉల్లంఘించడం
  డి) ఒక విమానాన్ని దారి మళ్లించడం
  వివరణ: బెలారస్‌పై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించింది. రోమన్‌ ప్రొటాసెవిచ్‌ అనే విలేకరిని అరెస్ట్‌ చేయడానికి ఒక విమానాన్ని బెలారస్‌ దేశం దారి మళ్లించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలను ప్రొటాసెవిచ్‌ పత్రికలో రాశారు. దీంతో పాలకుల నుంచి ముప్పు పొంచి ఉందని దేశం విడిచి పారిపోయాడు. అతడు ఒక విమానంలో ఏథెన్స్‌ నుంచి బయలుదేరాడు. విమానం బెలారస్‌ మీదుగా వెళుతుందని తెలిసి దానిపైకి యుద్ధ విమానాన్ని పంపి బాంబు ఉందని తప్పుడు సమాచారం ఇచ్చి దేశ రాజధానికి మళ్లించారు. అక్కడే ప్రొటాసెవిచ్‌ను అరెస్ట్‌ చేశారు.
 3. వివిధ దేశాల్లో వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కారణం? (సి)
  ఎ) కొవిడ్‌ బాధితులను రక్షించడానికి
  బి) భారత పర్యాటక రంగ సమాచారం
  ఇవ్వడానికి
  సి) లింగ వివక్షకు గురైన మహిళల సాయం కోసం
  డి) ఏదీకాదు
  వివరణ: వివిధ దేశాల్లో 10 వన్‌స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని భారత కేంద్ర మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయా దేశాల్లో లింగ వివక్షకు గురైన భారత మహిళల సాయం కోసం ఇది పనిచేస్తుంది. బహ్రెయిన్‌, ఖతార్‌, ఒమన్‌, యూఏఈ, సౌదీ అరేబియాలో జెడ్డా, రియాద్‌లలో, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌లో వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ తరహా కేంద్రాలు మన దేశంలో 700 ఉన్నాయి.
 4. ఏ తేదీని ‘వరల్డ్‌ నెగ్లెక్టెడ్‌ ట్రాపికల్‌ డిసీజెస్‌ డే’గా నిర్వహించాలని ఇటీవల వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ నిర్ణయించింది? (డి)
  ఎ) మార్చి 23 బి) జూన్‌ 21
  సి) జూన్‌ 4 డి) జనవరి 30
  వివరణ: జనవరి 30ని ‘వరల్డ్‌ నెగ్లెక్టెడ్‌ ట్రాపికల్‌ డిసీజెస్‌ డే (ఎన్‌టీడీ)’గా వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ప్రకటించింది. ఆఫ్రికా, ఆసియాల్లో అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో సంభవించే వ్యాధులు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ప్రొటోజోవా తదితర జీవులు ఈ వ్యాధులను కలిగిస్తాయి. ఆయా వ్యాధులపై పరిశోధనకు సాధారణంగా తక్కువ కేటాయింపులు ఉంటాయి. ఉదాహరణకు పాముకాటు, గజ్జి, దురద, చర్మరోగాలు. ఏటా ఈ వ్యాధులు దాదాపుగా బిలియన్‌ మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. నిజానికి వాటికి వైద్యం చేసి బాగు చేయవచ్చు. రాకుండా నిరోధించే అవకాశం కూడా ఉంది. అయితే పేదరికం, పర్యావరణ సంబంధ కారణాల వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ వ్యాధులు ప్రపంచానికి ముప్పు అంటూ 2012, జనవరి 30న లండన్‌ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. అందుకే జనవరి 30ని ఎన్‌టీడీగా నిర్వహించాలని నిర్ణయించారు.
 5. ప్రస్తుతం కరోనా వైరస్‌ రకాలకు ఏ దేశ వర్ణమాలతో పేర్లు పెడుతున్నారు? (బి)
  ఎ) చైనా బి) గ్రీకు సి) బ్రిటిష్‌ డి) బ్రెజిల్‌
  వివరణ: వైరస్‌ రకాలను సులువుగా గుర్తించడానికి వీలుగా గ్రీకు వర్ణమాలలో అక్షరాల పేర్లను పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ విధానం వల్ల వివిధ దేశాల్లో కనిపించిన కొత్త రకాల వైరస్‌ల సమాచారం ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఆయా దేశాల వేరియంట్‌గా పిలవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు బి.1.617గా పిలిచే వైరస్‌కు ఇండియన్‌ వేరియంట్‌గా చెప్పడం పట్ల భారత్‌ సైతం అభ్యంతరం చెప్పింది. అందుకే గ్రీకు వర్ణమాలను ఎంచుకున్నారు. బ్రిటన్‌లో వెలుగు చూసిన రకానికి ఆల్ఫా అని, దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన వేరియంట్‌కు బీటా అని, బ్రెజిల్‌లో ఉత్పన్నం అయిన రకానికి గామా అని, భారత్‌లో అంతకుముందు కనిపించిన మరో వేరియంట్‌కు కప్పా అని పేర్లు పెట్టారు.
 6. ‘పుసేగావ్‌-మహాసుర్నే’ రహదారి ఇటీవల వార్తల్లో నిలవడానికి కారణం? (సి)
  ఎ) ఈ రహదారిపై అరుదైన జంతువులు
  కనిపించాయి
  బి) యునెస్కో కట్టడాల జాబితాలో ఈ మార్గానికి చోటు లభించింది
  సి) తక్కువ సమయంలో ఇక్కడ రహదారి నిర్మాణం పూర్తి చేశారు డి) ఏదీకాదు
  వివరణ: మహారాష్ట్రలోని సతార-పండర్‌పూర్‌ రహదారి వెడల్పు పనుల్లో భాగంగా పుసేగావ్‌-మహాసుర్నేల మధ్య 39.671 కిలోమీటర్ల రహదారిని కేవలం 24 గంటల్లో పూర్తిచేసి రికార్డ్‌ సృష్టించారు. మే 30 ఉదయం 7 గంటలకు ప్రారంభించి మే 31 ఉదయం 7 గంటల వరకు పూర్తిచేశారు. గతంలో విజయపూర్‌-షోలాపూర్‌ల మధ్య 18 గంటల సమయంలో 25.54 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించగా అది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించింది. తాజాగా నిర్మించిన రోడ్డులో ఒకేసారి ఆరు ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగాయి.
 7. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల అంకుర్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం? (బి)
  ఎ) కొవిడ్‌ నియంత్రణ
  బి) చెట్లు నాటడం
  సి) అక్షరాస్యతను పెంచడం
  డి) జంతువుల సంరక్షణ
  వివరణ: రుతుపవన కాలంలో ప్రజలు చెట్లు నాటేలా ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంకుర్‌ అనే పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పాల్గొనే ప్రజల్లో అత్యుత్తమమైన వారిని ఎంపిక చేసి ప్రాణవాయు అవార్డ్‌ను ఇస్తారు. వాయుదూత్‌ అనే యాప్‌లో పేరు నమోదు చేసుకొని ఈ పోటీలో ప్రజలు పాల్గొనేందుకు వీలు కల్పించారు.
 8. అత్యవసర రుణ హామీ పథకాన్ని ఇటీవల కింద పేర్కొన్న ఏ రంగానికి విస్తరించారు? (డి)
  1. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు
  2. పౌర విమానయానం
   ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
   వివరణ: అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీజీసీ-ఎమర్జెన్సీ క్రెడిట్‌ గ్యారెంటీ స్కీం) ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పడం, పౌర విమానయాన రంగానికి అనువర్తిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల కోట్లతో దీనిని గతంలో ప్రకటించారు. తాజాగా విస్తరించారు. ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉపయోగపడుతుంది. అలాగే పౌర విమానయాన రంగానికి అత్యవసర రుణ హామీ పథకాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే అతిథ్యం, పర్యాటకం తదితర రంగాల్లోని సంస్థలకు రుణాలు ఇస్తున్నారు.
 9. ఇటీవల నానో యూరియాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రత్యేకత ఏంటి? (సి)
  1. ప్రపంచంలోనే తొలిసారిగా దీనిని
   ప్రవేశపెట్టారు
  2. రైతుల పెట్టుబడిని ఇది తగ్గిస్తుంది
  3. ఇజ్రాయెల్‌ తర్వాత దీనిని ప్రవేశపెట్టిన దేశం భారత్‌
   ఎ) 2, 3 బి) 2 సి) 1, 2 డి) 1
   వివరణ: భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో యూరియాను ప్రవేశపెట్టింది. ఈ తరహాది ప్రపంచంలోనే మొదటిది. రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడంతో పాటు దిగుబడులను పెంచుతుంది. ఫలితంగా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. దీనిని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. సంప్రదాయ యూరియా బస్తా ధరతో పోలిస్తే ఇది 10% తక్కువ. ఈ యూరియా వాడకంతో పంటల దిగుబడి సగటున 8% పెరుగుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశోధన అధ్యయనంలో తేలింది. గుజరాత్‌లోని కలోల్‌లో ఉన్న ఇఫ్కో నానో బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రం ఈ యూరియాను అభివృద్ధి చేసింది.
 10. ఆసియా బాక్సింగ్‌లో 75 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న భారత బాక్సింగ్‌ క్రీడాకారిణి ఎవరు? (ఎ)
  ఎ) పూజారాణి బి) మేరీకోమ్‌
  సి) మౌలోనోవా డి) నజమ్‌
  వివరణ: ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో హర్యానాకు చెందిన పూజారాణి మహిళల 75 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మౌలోనోవాను ఓడించి ఆమె విజయాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీని పూజారాణి గెలవడం ఇది రెండోసారి. 2019లో నిర్వహించిన ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ కూడా వెండి పతకాన్ని సాధించింది. తుదిపోరులో మేరీకోమ్‌ కజకిస్థాన్‌కు చెందిన నజమ్‌ కైజయ్‌బె చేతిలో ఓడి వెండి పతకంతో సరిపెట్టుకుంది. ఆసియా టోర్నీలో పతకం సాధించడం మేరీకోమ్‌కు ఇది ఏడోసారి. 2003లో ఆమె స్వర్ణం గెలిచింది. అలాగే పురుషుల్లో 91 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన సంజీత్‌ స్వర్ణాన్ని గెలిచాడు. తుదిపోరులో ఆయన కజకిస్థాన్‌కు చెందిన వాసిలీ లెవిట్‌ను ఓడించాడు.
 11. కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల కేంద్రం సూచించింది. వీటి ప్రధాన లక్ష్యం? (బి)
  ఎ) కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌
  బి) అందరికీ సమాన విద్యను అందించడం
  సి) లాక్‌డౌన్‌ సమయంలో రద్దీ నియంత్రణ
  డి) ఏదీకాదు
  వివరణ: అందరికీ సమాన విద్య అందించేందుకు 2021-22 విద్యా సంవత్సరంలో కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా నేపథ్యంలో గతేడాది అందరికీ సమాన విద్య అందలేదని కేంద్రం భావించి ఈసారి పక్కాగా పర్యవేక్షించేందుకు నిర్ణయించింది. పాఠశాలల్లో చేరిన, చేరని విద్యార్థులు, డ్రాపౌట్లు, బాలకార్మికులకు సంబంధించిన సమాచారం, పాఠ్యపుస్తకాల అందుబాటు మొదలైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ కేంద్రాలు సేకరిస్తాయి. విద్యావేత్తలతో పాటు విద్యారంగంలో ఉన్న అధికారులు కూడా ఈ కేంద్రంలో ఉంటారు. పాఠశాల అవసరాలపై ఎప్పటికప్పుడు ఈ కేంద్రం తెలుసుకొని పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది.
 12. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఎంత శాతం వరకు అనుమతిస్తారు? (సి)
  ఎ) 49% బి) 26% సి) 74% డి) 100%
  వివరణ: భారత బీమా సంస్థల నిబంధనలను కేంద్రం ఇటీవల జారీచేసింది. బీమా సవరణ బిల్లు-2021ని ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదించింది. దీని ప్రకారం ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49% నుంచి 74 శాతానికి పెంచారు. విదేశీ పెట్టుబడులు ఉన్న భారతీయ బీమా సంస్థలో మెజారిటీ సంఖ్యలో డైరెక్టర్లు, కీలక మేనేజ్‌మెంట్‌ అధికారులు భారతీయులై ఉండాలి. అలాగే చైర్‌పర్సన్‌ బోర్డ్‌లో కనీసంగా ఒక భారతీయుడికి అయినా చోటు కల్పించాలి. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు విదేశాల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 13. ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం కింది వాటిలో ఏ చర్యవల్ల ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది? (డి)
  1. ప్రైవేట్‌ వినియోగం
  2. పెట్టుబడులు పెరగడం
   ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
   వివరణ: కరోనా ఉధృతి తగ్గాక జీడీపీ వృద్ధి కొనసాగాలంటే ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులు పుంజుకోవాలని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో సూచించింది. జీడీపీలో 85% వాటా వాటిదే ఉందని తెలిపింది. ఏవైనా సంక్షోభాల తర్వాత వినియోగం వల్లే రికవరీ సాధ్యమవుతుందని చెప్పింది. పెట్టుబడుల ద్వారా జరిగే రికవరీలు దీర్ఘకాలం స్థిరంగా కొనసాగుతాయని పేర్కొంది. ఉద్యోగాల సృష్టి జరిగి వినియోగాన్ని పెంచుతుందని, కాబట్టి ప్రైవేట్‌ గిరాకీ పాత్ర కీలకంగా ఉండనుందని వెల్లడించింది.
 14. నీతి ఆయోగ్‌ తరహాలోనే ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం? (డి)
  ఎ) మధ్య ప్రదేశ్‌ బి) మహారాష్ట్ర
  సి) గుజరాత్‌ డి) గోవా
  వివరణ: జీఐఎఫ్‌టీ (గిఫ్ట్‌) పేరుతో నీతి ఆయోగ్‌ తరహా ఒక వ్యవస్థను గోవా రాష్ట్రం ఏర్పాటు చేసింది. జీఐఎఫ్‌టీ పూర్తి రూపం- గోవా ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌. విధాన రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సహకరిస్తుంది. అమలులో కూడా తగిన సూచనలను ఇస్తుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో చేయాల్సిన పనులను సమన్వయం చేస్తుంది.
 15. ‘గార్డియన్‌ మినిస్టర్స్‌’ను ప్రవేశపెట్టిన రాష్ట్రం? (సి)
  ఎ) పశ్చిమబెంగాల్‌ బి) కేరళ
  సి) అస్సాం డి) కర్నాటక
  వివరణ: 13 మంది మంత్రుల బృందంతో కలిసి ‘గార్డియన్‌ మినిస్టర్స్‌’ అనే విధానాన్ని అస్సాం రాష్ట్రం కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పరిపాలన సంస్కరణలు, పథకాలను అమలు చేయడం ఈ వ్యవస్థ బాధ్యత. ప్రతి మంత్రికి రెండు లేదా మూడు జిల్లాలను కేటాయిస్తారు. వేగంగా, సుస్థిరంగా విధానాలు కొనసాగేలా వీళ్లు చూస్తారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వానికి వాళ్లు సూచించవచ్చు. వాటిని రాష్ట్ర క్యాబినెట్‌ పరిశీలిస్తుంది. తరచూ ఆయా జిల్లాలో ఈ వ్యవస్థలోని సభ్యులు పర్యటిస్తారు.

వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్‌
9849212411

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘గార్డియన్‌ మినిస్టర్స్‌'ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?
‘గార్డియన్‌ మినిస్టర్స్‌'ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?
‘గార్డియన్‌ మినిస్టర్స్‌'ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?

ట్రెండింగ్‌

Advertisement